calender_icon.png 18 July, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమెను చూసినప్పుడల్లా..!

14-07-2025 12:00:00 AM

పెళ్లున మూణ్ణాళ్లకే 

కాలనీలోకి అడుగు పెట్టింది

బిత్తర చూపులు చూస్తూ 

ఇల్లిల్లూ తిరిగింది

ఒద్దికగా పట్టుకున్న చెత్త డబ్బాను

రిక్షాలో అంతే ఒద్దికగా ఒంపి 

తిరిగి ఇంటి ముందు పెట్టేది

భర్త చాటు భార్యగా 

బెరుకు బెరుగ్గా తచ్చాడేది

కొన్నాళ్లకు ఉబ్బెత్తు కడుపుతో 

రిక్షా లాగింది

పుట్టిన బిడ్డలకు 

రిక్షా కింద జోలె కట్టి

బతుకు బండిని 

లగాయించి తొక్కింది

విజిల్ తోనే కాదు 

తన చిరునవ్వు తోనూ 

కాలనీని మేల్కొల్పడం నేర్చుకొంది 

సేకరించిన చెత్త లోనే

సంపదను కనుగొంది

ఐశ్వర్యాన్ని ఒంటి మీదే కాదు

బతుకులోనూ మెరిపించింది

కొత్త ఆటో రిక్షాతో 

భర్త వెంట గర్వంగా

చెత్త కోసం వచ్చింది

అప్పుడు ఆమె కళ్లలోని మెరుపు

కాలనీ మొత్తాన్ని చుట్టింది

ఎప్పుడు నేర్చిందో కాని

ఇప్పుడు తనే 

చెత్త ఆటోను ఉరకలెత్తిస్తోంది

ఒకప్పుడు డబ్బుల కోసం 

దీనంగా చూసిన ఆమె

ఇప్పుడు ‘డబ్బులియ్యాలమ్మా.. డబ్బులు’

అని గట్టిగా గదమాయిస్తోంది

చెత్త కోసం బెరుకుగా 

అడుగిడిన అమ్మాయిప్పుడు

ఆత్మ విశ్వాసపు అడుగులేస్తోంది

ఆమెను చూసినప్పుడల్లా

స్త్రీ సాధికారత అంటే ఏంటో

అవగతమవుతోంది ! 

- వీఆర్ తూములూరి