1 April, 2026 | 8:45 AM

ఇదెక్కడి న్యాయం

07-12-2024 04:45 PM

మంత్రి రాకతో అధికార కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు

ఎమ్మెల్యేను గెలిపించిన పాపానికా మా అరెస్టులు అంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు

ముందస్తు అరెస్టు అయిన వారిలో మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు

కామారెడ్డి (విజయక్రాంతి): ఇదెక్కడి న్యాయం ఎమ్మెల్యేను గెలిపించిన పాపానికి మాకు అక్రమ అరెస్టుల అంటూ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం 20 ఏళ్లుగా పనిచేస్తూ కష్ట నష్టాలను ఎదుర్కొని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తోట లక్ష్మీకాంతరావును గెలిపించిన పాపానికా మాకు ఈ ఇబ్బందులు అని అంటున్నారు. ఇవే మీ ముందస్తు అరెస్టులు తాము ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి లాగా అధికార పార్టీకి చెందిన తమను ముందస్తు అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే ది ఇదేమి పద్ధతి మాకు అంతు పట్టడం లేదని జుక్కల్ నియోజకవర్గంలోని కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో అధికార పార్టీ కాంగ్రెస్ లోనే వర్గ పోరు నడుస్తుంది.

శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ కౌలాస్ కోట మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఇటీవల నూతనంగా మంజూరైన సమీకృత గురుకుల పాఠశాల భవనానికి భూమి పూజ వంటి కార్యక్రమాలు రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు  చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుతో విభేదించిన అధికార పార్టీకి చెందిన మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు మంత్రి కార్యక్రమంలో నిరసన తెలుపుతారని భావించి ముందస్తు అరెస్టులు చేశారు. బిచ్కుంద జుక్కల్ మద్నూర్ డోంగ్లి మండలాలకు చెందిన ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గంగా భావిస్తున్న అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషనులకు తరలించారు.

ప్రతిపక్ష పార్టీల నాయకుల అరెస్టు చేయడం చూసాము కానీ ఇక్కడ అధికార పార్టీ నాయకులను అధికార పార్టీకి చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు రాక సందర్భంగా అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో దింపి ఎన్నికల్లో గెలిపిస్తే తమను ఏడాదిలోనే అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మంత్రి కార్యక్రమానికి రాకుండా పోలీసుల చేత ముందస్తు అరెస్టు చేయించడం ఇదెక్కడి న్యాయమంటూ జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేను గెలిపించి ఇబ్బందులు పడవలసి వస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఎమ్మెల్యే చేస్తున్న ఇబ్బందులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 20 సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేసిన తమకు ముందస్తు అరెస్టులు చేయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిరంకుషత్వంగా వ్యవహరించడంని కండిస్తున్నట్లు వారు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ జెడ్పిటిసి సభ్యులు జయ ప్రదీప్, కమల్ కిషోర్, మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ పటేల్, మాజీ ఎంపీపీ లక్ష్మణ్ పటేల్, మాజీ ఎంపీటీసీ సురేష్, మాజీ సర్పంచ్ వినోద్, మాజీ సర్పంచ్ విట్టల్ రావు పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ లతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారని వారు తెలిపారు.