08-03-2025 12:43:32 AM
హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలర్ట్ అయింది. పార్టీ అధికారంలో ఉండి సిట్టింగ్ సీటును కోల్పోవడంపై పార్టీ ఢిల్లీ పెద్దలు సీరియస్‌గానే ఉన్నట్లు సమాచారం. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, మంత్రులు ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రులు శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించారు.
ఈ ఎన్నికల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడకుండా చూసుకోవాలని, బీఆర్‌ఎస్, బీజేపీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని, మెజార్టీ స్థానాలు గెలుచుకునేలా అందరు కలిసికట్టుగా పని చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా నేతలకు సూచించినట్లు తెలిసింది. పార్టీ అంతర్గత విషయాలు బయట ప్రసావించవద్దని, ఏమైనా సమస్యలుంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
జిల్లా అభివృద్ది, పెండింగ్ పనులపై దృష్టి..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశంలో జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులపై సుదీర్ఘంగా చర్చించారు. కరీంనగర్‌ను గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, మాటలకే పరిమితమైందని విమర్శించారు.
కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణారావు, మేడిపల్లి సత్యం, సంజయ్‌కుమార్‌తో పాటు జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనాయకులు హాజరయ్యారు.