calender_icon.png 15 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు బకాయిలపై నోరు మెదపరేం?

15-09-2025 01:25:45 AM

-ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు బంద్ ప్రకటించినా స్పందించరా?

-విద్యా సంస్థల బకాయిలకు లేని నిధులు.. ప్రాజెక్టులకెక్కడివి

-విద్యారంగ సమస్యల పరిష్కారానికి మరో పోరు: మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల పై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు నిలదీశారు. నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు రెండేళ్లుగా మొత్తుకుంటున్నా రేవంత్ రెడ్డి సర్కార్ మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటని విమర్శించారు.   ఫీజు రీయింబర్స్ మెంట్‌పై పీడీఎస్‌యూ రూపొందించిన ‘బిగ్ డిబేట్’ పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రకటన విడుదల చేసిన హరీశ్ రావు సోమవారం నుంచి నిరసనలు, నిరాహార దీక్షలు, నిరవధిక బందులు చేయనున్నట్లు ప్రకటించిన ప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో రూ.20 వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు తారుమారయ్యాయని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయని, గ్రీస్ చానెల్‌లో నిధుల విడుదల అన్న మాటలు నీటి మూటలేనా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభు త్వం కళ్లు తెరవాలని విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ మరో పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ‘అల్లరి చేయొద్దు’ అని ఆర్థిక మంత్రి సుద్దు లు చెప్పినంత మాత్రాన యాజమాన్యాలు, విద్యార్థుల గోడు తీరదన్నారు.  అతి తక్కువ కాలంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన విద్యా శాఖ మంత్రి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.  

ప్రాజెక్టులకు నిధులెక్కడివి..

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఫీజు రీయింబర్స్ ఇవ్వడానికి లేని డబ్బులు సీఎం కమిషన్ల ప్రాజెక్టులకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు డీఏలు ఇవ్వమంటే ‘నన్ను కోసుకొని తిన్నా పైసలు లేవు’ అని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి లక్షల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల చదువు పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ లేదా, విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఆలోచన లేదా అని నిలదీశారు. ఒకవైపు కేసీఆర్‌పై కక్షతో గురుకులాలను, మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా ఉన్నత విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రెండేళ్ల పాలనలో పెండింగ్ బిల్లుల కోసం రెండుసార్లు సచివాలయంలో కాం ట్రాక్టర్లు ధర్నా చేసే స్థితి వచ్చినా ఈ ప్రభుత్వానికి సిగ్గులేదని, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, కమిషన్లు పొందడంపై ఉన్న చిత్తశుద్ధి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంపై లేదని విమర్శించారు.