18-10-2025 12:00:00 AM
-అధికారుల నిర్లక్ష్యంతో జీతాలు అందని పరిస్థితి
-లబోదిబోమంటున్న గెస్ట్ లెక్చరర్లు
-జాబితాలో పేర్లు లేకపోవడంపై చెలరేగుతున్న విమర్శలు
ఖమ్మం, అక్టోబరు 16 (విజయ క్రాంతి): దాదాపు ఏడాది నుంచి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోయినా గెస్ట్ లెక్చరర్లు అవేమి పట్టించుకోకుండా పాఠాలు చెబుతున్నారు. నేడు కాకపోతే, రేపైనా జీతం అందిస్తుందన్న ఉద్దేశంతో తమ బాధ్యతలను విస్మరించలేదు. తమను గెస్ట్ లెక్చరర్లుగా గుర్తించింది కాబట్టి జీతాలు విడుదల చేసే సమయంలో అన్యాయం చేయదని భావించారు. ఇప్పుడు అదే వారి కొంపముంచింది.
జిల్లాలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జాబితాలో కొంతమంది పేర్లు లేకపోవడంతో అవాక్కవటం వారి వంతయింది. ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందా? లేక ప్రభుత్వం కొంతమంది గెస్ట్ లెక్చరర్లకు మాత్రమే అనుమతినిచ్చిందా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత జిల్లా అధికారులు మాత్రం జీతాలు రాని గెస్ట్ లెక్చరర్లకు అన్యాయం జరగనివ్వబోమని, అందరికీ న్యాయం చేస్తామని చెబుతోంది.
పేర్లు ఎందుకు చేర్చలేదు..?
జిల్లావ్యాప్తంగా ఆయా జూనియర్ కళాశాలలో దాదాపు 34 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. సంబంధిత శాఖ విడుదల చేసిన జీతాల జాబితాలో వీరందరి పేర్లు లేకపోవడం గమనార్హం! ఇలా ఎందుకు జరిగిందనే విషయం పై భిన్న రకమైన వాదనలు వినిపిస్తున్నాయి. జాబితా రూపొందించే క్రమంలో సీనియర్ గెస్ట్ లెక్చరర్లను తొలి జాబితాలో, జూనియర్ గెస్ట్ లెక్చరర్లను మలి జాబితాలో చేర్చిందని తెలుస్తోంది. అందుకే మొదట విడుదలైన జీతం జాబితాలో అందరి పేర్లు లేవని సంబంధిత అధికారులు చెబుతున్నట్లు సమాచారం.
అధికారులు చెబుతున్న ప్రకారం జీతాలు అందుకున్న జాబితాలో సీనియర్ల పేర్లు ఉండాలి. కానీ జాబితా చూస్తే ఏడెనిమిది ఏళ్ల నుంచి బోధన చేస్తున్న వారి పేర్లు సైతం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక కొత్తగా మొదలైన జూనియర్ కళాశాలలో బోధనకు నియమితులైన గెస్ట్ లెక్చరర్ల పేర్లను కూడా మలి జాబితాలో చేర్చామని, అందుకే ప్రస్తుత జాబితాలో వీరి పేర్లు లేవని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకున్నా, కొత్తగా ఏర్పడిన కళాశాలలో సైతం ఒకరి పేరు ఉండి మరొకరి పేరు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం వల్ల గెస్ట్ లెక్చరర్లు జీతాలు అందుకోకుండా నానా ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం అనుమతించలేదా..?
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది వరకు 1654 మంది గెస్ట్ లెక్చరర్లు పని చేసేవారు. ఆ తర్వాత ప్రభుత్వం 1256 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేసింది. భర్తీ చేయగా మిగిలిన పోస్టులకు మాత్రమే గెస్ట్ లెక్చరర్లకు అనుమతిస్తామని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 398 మంది గెస్ట్ లెక్చరర్లు మాత్రమే ఈ ఏడాది మళ్లీ రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం దక్కించుకున్నారు. అయితే ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టుల్లో కొన్ని సెకండ్ వేకెన్సీ, క్లియర్ వేకెన్సీల్లో సర్దుబాటు అవటంతో రాష్ట్రవ్యాప్తంగా మరో 185 పోస్టులు పోస్టులకు ఖాళీ ఏర్పడింది. ఇక దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన కొత్త కళాశాలకు కూడా లెక్చరర్ల అవసరం ఏర్పడింది. దీంతో ఆయా కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ల ద్వారానే బోధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా బోధన చేయాలంటే మరో వెయ్యి గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అవకాశం ఇవ్వాలని సంబంధిత శాఖ కమిషనర్ ప్రభుత్వానికి తెలియజేశారు.
అందుకు అంగీకరించని ప్రభుత్వం 398 మంది తోడు మరో 494 మంది గెస్ట్ లెక్చరర్లకు మాత్రమే అనుమతిని ఇచ్చింది. ఇందుకు ఇంటర్మీడియట్ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు అంగీకారం తెలిపారు. జిల్లాలో ఉన్న గెస్ట్ లెక్చరర్లను 398 మందికి సంబంధించిన జాబితాలో, అలాగే 494 మందికి సంబంధించిన జాబితాలో చేరుస్తూ తమకు పంపించాలని సంబంధిత శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికారులు జాబితా పంపించారు.
దీనివల్ల అంతకుముందు జిల్లాలో పనిచేసిన 70 మందికి గాను 34 మంది గెస్ట్ లెక్చరర్లు మాత్రమే అవకాశం దక్కించుకున్నారు. వీరే పాత, కొత్త కళాశాలల్లో సర్దుబాటు అయ్యారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో జాబితాను పంపే క్రమంలో సంబంధిత శాఖ జిల్లా అధికారులు ఎవరిని ఏ జాబితాలో చేర్చిందో తేలటం లేదు. దీనివల్ల పాత కళాశాలలో పనిచేసే వారు, కొత్త కళాశాలలో పనిచేసే వారు, జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా జీతాలు అందుకునే వారి జాబితా గందరగోళంగా తయారయింది. దీంతో కొంతమంది జీతాలు అందుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై సంబంధిత శాఖ జిల్లా అధికారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
మళ్లీ ఎప్పుడో..!
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం సాధారణంగా రెండు మూడు నెలలకు ఓసారి జీతాలను అందిస్తుంది. అలాగే గెస్ట్ లెక్చరర్లకు కూడా అందిస్తూ ఉండి ఉంటే, ప్రస్తుతం విడుదల చేసిన జీతం జాబితాలో తమ పేరు లేకపోయినా వీరంతా పెద్దగా అసహనానికి గురి అయ్యేవారు కాదు. గెస్ట్ లెక్చరర్లు దాదాపు పది నెలలుగా జీతాలు అందుకోవటం లేదు. వీరంతా జీతం ఎపుడు వస్తుందా? తమ ఇబ్బందులు, అప్పులు ఎపుడు తీరుతాయా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి సమయంలో అసలు జాబితాలో తమ పేరే లేదని తెలిసి తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. కొంతమందికి ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వటం లేదని, అసలు జాబితాను తప్పులతడకగా ఎందుకు రూపొందించారని? ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అవకాశం కోల్పోయిన లెక్చరర్ల కోసం మరో జాబితాను తయారు చేస్తామని, తమ శాఖ కమిషనర్ కు వెంటనే పంపిస్తామని సంబంధిత జిల్లా అధికారులు చెబుతున్నారు.
గతంలో పంపించిన జాబితాలోని వారికే ఇంకా జీతాలు అందలేదని, ఇక ఇప్పుడు తమ పేర్లను జత చేసి, జాబితాను రాష్ట్రస్థాయి అధికారులకు పంపిస్తే వారి నుంచి ఆమోదం లభించేది ఎన్నడో, తమకు జీతాలు అందేది ఎపుడోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గెస్ట్ లెక్చరర్ల జీవితానికి ఉద్యోగ భద్రత ఉండదని, దీనికి తోడు అధికారులు, ప్రభుత్వ తీరు వల్ల తాము జీతానికి కూడా నోచుకుని పరిస్థితి ఏర్పడిందని వీరంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకొని తమ పేర్లను జాబితాలో చేర్చాలని, తమకు జీతాలు సక్రమంగా అందించాలని పేర్లు గల్లంతయిన గెస్ట్ లెక్చరర్లు కోరుతున్నారు.
100శాతం ఫలితాలు చూపుతున్నా..
హిస్టరీ లెక్చరర్ గా నాకు దాదాపు 9 ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం కూసుమంచి జూనియర్ కళాశాలలో బోధన చేస్తున్నాను. నేను పనిచేసిన ప్రతిచోట పూర్తి నిబద్ధతను చూపిస్తూ 100% ఫలితాలను రాబడుతున్నాను. జీతం లేని వేసవి రెండు నెలలు కూడా కళాశాల తరఫున ప్రచారం చేస్తూ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు దోహద పడుతున్నాను. ఇక తొమ్మిది నెలల నుంచి జీతం కూడా అందుకోవటం లేదు. ప్రస్తుతం జీతం అందుకునే జాబితాలో నా పేరు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వం మాలాంటి వారికి న్యాయం జరిగేలా చూసి వెంటనే జీతాలు అందించాలి.
సోమలింగం యాదవ్, గెస్ట్ లెక్చరర్, జూనియర్ కళాశాల, కూసుమంచి
ఇలా చేయటం ప్రభుత్వానికి తగదు
విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ముందు సంబంధిత అధికారుల ఆమోదంతోనే బోధన చేసేందుకు రెన్యువల్ చేయించుకున్నాను. ఇప్పుడు జాబితాలో మా పేరు లేదంటే తప్పు ఎక్కడ జరిగిందోననే అనుమానాల వ్యక్తం అవుతు న్నాయి. ఖాళీగా ఉండి నిరుద్యోగులుగా అనిపించుకోవడం కంటే, ఇలా ఉద్యోగం చేసుకుంటూ మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నామని భావనలో ఉన్నాం. సంబంధిత శాఖ విడుదల చేసిన జాబితాలో మా పేరు లేకుండా ఉండటం చూస్తే మేము ఉద్యోగులమో, నిరుద్యోగులమో అర్థంకాని పరిస్థితి. మా లాంటివారికి అన్యాయం చేయడం ప్రభుత్వానికి తగదు. జరిగిన పొరపాటున సరిచేసి మాకు వెంటనే జీతాలు అందేలా చూడాలి.
జ్యోతి, గెస్ట్ లెక్చరర్, బోటని, నయాబజార్, ఖమ్మం
వెంటనే జీతాలు అందించాలి
మాకు అందించే జీతాల పట్ల ప్రభుత్వం వివక్ష చూపటం న్యాయం కాదు. ఇన్ని నెలల నుంచి జీతాలు రాక ఇబ్బందులు పడుతుంటే అసలు జాబితాలో మా పేరే లేదని చెప్పడం మరింత బాధాకరం. అసలే మధ్యతరగతి జీవితాలు. రోజు ఖర్చులు పెట్టుకుంటూ, అంతంత దూరం వెళ్లి పాఠాలు చెబుతుంటే దానిని గుర్తించకుండా, జీతాలు ఇవ్వకుండా సతాయించటం ప్రభుత్వానికి తగదు. వెంటనే పెండింగ్ జీతాల జాబితాలో మా పేరు చేర్చి, మాకు అందేలా చూడాలి.
బి ప్రమీల, గెస్ట్ లెక్చరర్, తెలుగు, కందుకూరు, వేంసూరు మండలం