30-12-2025 12:09:10 AM
గెలఫూ, డిసెంబర్ 29 : సాధారణంగా టీ20 ఫార్మాట్‌లో 3 లేదా 4 వికెట్లు తీస్తేనే అద్భుత గణాంకాలుగా చెబుతారు. అలాంటిది ఒకే బౌలర్ ఏకంగా 8 వికెట్లు తీస్తే అది రికార్డులకే రికార్డుగా నిలిచిపోతుంది. భూటాన్‌కు చెందిన స్పిన్నర్ సోనమ్ ఎషే ఇలాంటి రికార్డునే సాధించాడు. తన 4 ఓవర్ల స్పెల్ లో 7 పరుగులే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ అరుదైన ఘనత సాధించాడు.
అంతర్జాతీయ టీ20లు , ఇతర టీ20 లీగ్స్‌లో ఇప్పటి వరకూ ఎవ్వరూ కూడా ఇలాంటి రికార్డు సాధించలేదు. 22 ఏళ్ల సోనమ్ నాలుగు ఓవ ర్ల స్పెల్‌లో ఒక మెయిడెన్ కూడా ఉంది. ఇప్పటి వరకూ టీ20 క్రికెట్‌లో అత్యుత్తమం గా ఏడు వికెట్ల ప్రదర్శనలే నమోదయ్యాయి. గతంలో మలేషియా బౌలర్ ఇద్రుస్ చైనాపై 7 వికెట్లు, బహ్రెయిన్‌కు చెందిన అలీ దావూ ద్ 7 వికెట్ల ప్రదర్శనలే బెస్ట్‌గా నిలిచాడు.