08-11-2025 12:58:00 AM
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఘటన
ఖమ్మం, నవంబర్ 7 (విజయ క్రాంతి): తన భార్య మరో వ్యక్తిని ప్రేమించిందని తెలుసుకున్న భర్త వారి బంధానికి అడ్డు రాకుండా ఇద్దరినీ ఒకటి చేశాడు. భార్య, స్నేహితుడు చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకనో, పరువు పోయిందన్న బాధనో తెలియదు కానీ మనస్థాపానికి గురైన భర్త ఉరేసుకుని బలవన్మరణాకి పాల్పడ్డాడు. ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వివాహేతర సం బంధం ఓ పచ్చని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. సత్తుపల్లి పట్టణానికి చెందిన షేక్ గౌస్‌కు 8 సంవత్సరాల క్రితం పెళ్లయింది. ఈ జంటకు ముగ్గురు సంతానం.
కుటుంబ పోషణ కోసం అతడు సత్తుపల్లి పట్టణం దగ్గరలోని ఓ గ్రామానికి వెళ్లి ఆటో నడిపేవాడు. అలా వచ్చిన డబ్బుతో భార్యాబిడ్డలను పోషించేవాడు. ఈ క్రమంలో గౌస్ భార్యకు అతడి స్నేహితుడితో పరిచయం.. ప్రేమకు దారి తీసింది. ఈ ప్రేమ వ్యవహారం కొన్నాళ్లకు గౌసుకు తెలిసింది. తన భార్యకు, ఆమె ప్రేమించిన వ్యక్తికి పెళ్లి చేయాలని భావించాడు. ఈ విషయం భార్యకు చెప్పాడు.
ఆమె కూడా అంగీకరించింది. దీంతో కొన్ని రోజుల క్రితమే భార్యకు, ఆమె ప్రియుడికి దగ్గరుండి మరీ పెళ్లి చేయించాడు గౌస్. ఆ తర్వాత అతడు సత్తుపల్లిలోని తన ఇంటికి వెళ్లి ఉరేసుకున్నాడు. గౌస్ కుటుంబ సభ్యులు మాత్రం భార్యతో ఉండే కలహాల వల్లే గౌస్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గౌస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లల పరిస్థితి అగమ్యగోచరం
గౌస్ మరణించడంతో అతని ముగ్గురు పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తల్లి ప్రియుడితో వెళ్లి పోవటం, తండ్రి ఆత్మహత్య చేసుకోవటంతో ముగ్గురు పిల్లలు అనాథలు అయ్యారు. భార్యను ప్రియుడితో కలిపిన గౌస్, తన బిడ్డల గురించి ఆలో చించి ఉంటే పిల్లలు దిక్కులేని వారిగా మిగిలే వారు కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. కన్నీరు కార్చారు.