calender_icon.png 7 June, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ దేవుడంటూనే..దండెత్తుతారా?

30-05-2025 12:00:00 AM

  1. మీ ఇంటి పంచాయతీ అనుకుంటున్నారా..

ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు విసుర్లు

మహబూబాబాద్, మే 29 (విజయ క్రాంతి): ఓవైపు కేసీఆర్ ను దేవుడు అంటూనే.. విమర్శలు చేస్తూ.. దేవుడు పైనే దండెత్తుతావా.. ఇదేమైనా మీ ఇంటి పంచాయతీ అనుకుంటున్నారా.. అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు ప్రశ్నించారు. గురువారం ఆయన ‘విజయ క్రాంతి’ ప్రతినిధి తో మాట్లాడుతూ మీరు రాసిన లేఖలోని విషయాలపై అధినేత కేసిఆర్ స్పందించేంతవరకు వేచి ఉండాలన్నారు.

ఇప్పటికే అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్‌ఎస్ పార్టీని వేధిస్తున్నాయని, ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అధినేత కేసిఆర్ ఆదేశాలు వచ్చేంతవరకు సమయమనం పాటించాలన్నారు. ఉద్యమ నాయకునిగా, టిఆర్‌ఎస్ సీనియర్ నేతగా, కెసిఆర్ శిష్యునిగా జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత తీరును చూసి మాట్లాడ లేకుండా ఉండలేకపోతున్నట్లు రవీందర్రావు తెలిపారు.

కెసిఆర్ దేవుడు అయితే దేవుడు పైన దండెత్తుతారా.. కెసిఆర్ స్పందించేంతవరకు ఓపిక పట్టలేరా అని ప్రశ్నించారు. దెయ్యాలు, భూతాలు అనడం కరెక్ట్ కాదని, లేక బహిర్గతం వెనుక ఎవరున్నారో ఖచ్చితంగా తేలాల్సిందేనని, దీన్ని పార్టీ వ్యవహారంలో కాకుండా కుటుంబ పంచాయతీలా ఎమ్మెల్సీ కవిత వ్యవహరిస్తున్న తీరు ఉందన్నారు. కవిత, కేటీఆర్ కు మధ్య ఏం జరిగిందో మాకు తెలియదని, ప్రతి ఒక్కరూ పార్టీ అధినేత ఆదేశాలు పాటించాలని, నాయకుడి మనోభావాలను గౌరవించాలని, వ్యక్తిగతంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

కవిత జైల్లో ఉన్నప్పుడు కెసిఆర్ చాలా బాధపడ్డారని, కవిత ఉద్యమ నాయకురాలని, కెసిఆర్ కూతురుగా ఆమెను గౌరవిస్తామని, ఎవరైనా పరిధి దాటకూడదని, అధినేత కేసిఆర్ ఆదేశాలిస్తే ఖచ్చితంగా కవిత వ్యాఖ్యలపై స్పందిస్తామని రవీందర్రావు తెలిపారు.