14-03-2025 01:20:54 AM
అనధికార లే ఔట్ల క్రమబద్ధీకరణ సువర్ణ అవకాశంపై విస్తృత ప్రచారం
కరీంనగర్, మార్చి13(విజయాక్రాంతి): అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణకు, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్ ఆర్ ఎస్ 25 శాతం రాయితీ అవకాశం పై విస్తృత ప్రచారం చేస్తున్న స్పందన నామమాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు నగరపాలక సంస్థ పరిధిలో కోటి తుపాయల వరకు, సూడా పరిధిలో 70 లక్షల వరకు మాత్రమే ఆదాయం వచ్చింది.
ఎఫ్.టి.ఎల్, నిషేధించిన సర్వే నెంబర్లు మినహా ఎల్. ఆర్. ఎస్ కు దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించారు. ఫీజు చెల్లించేందుకు అర్హత ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుదారులు ఎవరైనా ఈనెల 31వ తేదీ లోగా చెల్లిస్తే 25 శాతం మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. రుసుము చెల్లించిన వారి దరఖాస్తు అధికారులు పరిశీలించి రెండు రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తారని చెపుతున్నా రియల్ ఎస్టేట్ పడిపోవడంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. బ్యాంకు ల ద్వారా రుణం పొంది ఇల్లు నిర్మించుకోవలనుకునే వారు మాత్రమే ముందుకు వస్తున్నారు.
అనధికారికంగా లేఅవుట్లు చేసి అందులో 10 శాతం ప్లాట్లను విక్రయించిన వారికి మిగతా ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉందని తాజాగా ప్రకటించడం తో ఈ నెల 31 వరకు క్రమబద్దీకరణ చేసుకునే వారి సంఖ్య పెరుగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లించి క్రమబద్దీకరణ చేసుకోనే వెసులుబాటు కల్పించారు. కరీంనగర్ జిల్లాలో 68,405 ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు రాగా 44,437 ఆమోదం పొందాయి. ఇందులో సగం మంది ఎల్ ఆర్ ఎస్ కట్టినా కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అందజే 25 శాతం రెబెట్ పై విస్తృత ప్రచారం చేస్తున్నారు.
విస్తృత ప్రచారం చేయాలి
కార్యదర్శులు, వార్డు స్థాయి అధికారులు ఎల్ ఆర్ ఎస్ రాయితీపట్ల ప్రజలకు విస్తృత ప్రచారం చేయాలి. ప్రతి గ్రామపంచాయతీలలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలి. . క్రమబద్ధీకరణకు రుసుము నిర్ణయించిన వారందరికీ సమాచారం చేరేలా చూడాలి.
- ప్రఫుల్ దేశాయి , అదనపు కలెక్టర్