calender_icon.png 30 May, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంచనాలను పెంచడం.. కమీషన్లు దంచడం: హరీశ్ రావు

28-05-2025 08:22:34 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): శంకుస్థాపన చేసింది లేదు, తట్టెడు మట్టి ఎత్తింది లేదు నిర్మాణ వ్యయాన్ని కోట్లకు కోట్లు పెంచడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Siddipet MLA Harish Rao) పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట వేల కోట్లు దండుకునేందుకు ఇది కాంగ్రెస్ ఆడుతున్న మరో నాటకం అని తెలిపారు. 2024 జూన్ 24వ తేదీన ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క ఆదిలాబాద్ లో మాట్లాడుతూ... రూ.80-100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని ప్రకటిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) 2024 అక్టోబర్ 11వ తేదీన రూ.125 కోట్ల వ్యయంతో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు.

వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2025 మే రెండో వారంలో రూ.135-150 కోట్లతో టెండర్లు సైతం ఖరారు చేశారని, మే 27న 20 స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి రూ.4,000 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో నెంబర్ 96 విడుదల చేసినట్లు వెల్లడించారు. అంటే ఒక్కో స్కూల్ అంచనాలను ఏ పని మొదలు కాకుండానే దాదాపు మూడు రెట్లు, అంటే రూ.200 కోట్లకు పెంచారని ఆరోపించారు. జలయజ్ఞం నుంచి రెసిడెన్షియల్ స్కూళ్ల వరకు అంచనాలను పెంచడం, కమీషన్లు దంచడం. ఇదే కదా కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన? అని హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.