02-11-2025 12:00:00 AM
హోబార్ట్, నవంబర్ 1 : ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్‌లోనూ వెనుకబడింది. రెండో టీ ట్వంటీలో చిత్తుగా ఓడిన భారత్ ఇప్పుడు సిరీస్ సమం చేయడమే లక్ష్యంగా మూడో మ్యాచ్‌కు రెడీ అయింది. ఆదివారం హోబార్ట్ వేదికగా జరిగే మ్యా చ్‌లో గెలిచి దెబ్బకు దెబ్బ కొట్టాలని భావిస్తోంది. అయితే బ్యాటర్లు రాణిస్తేనే అది సాధ్యమవుతుంది.
ఎందుకంటే గత మ్యాచ్ లో 125 పరుగులకే కుప్పకూలిన భారత్ జట్టులో ఏ ఒక్కరూ స్థాయికి తగినట్టు ఆడలేదు. అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా ఆడ కుంటే ఆ స్కోరు కూడా వచ్చేది కాదు. ఈ నేపథ్యంలో గిల్, సంజూ శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు శివమ్ దూబే కూడా మెరుపులు మెరిపించాల్సిందే. ము ఖ్యంగా పిచ్‌ను అర్థం చేసుకుని బ్యాటింగ్ చేయాలంటూ పలువురు మాజీలు సూచిస్తున్నారు. రెండో టీ20లో దూకుడుగా ఆడి వికెట్లు పారేసుకోవడంతో తక్కువ స్కోరుకే ఆలౌటయ్యారు.
మరోవైపు బౌలింగ్‌లోనూ ఇంకా మెరుగుపడాల్సిందే. స్పిన్నర్లు అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. మెల్ బోర్న్‌లో పేసర్లు వికెట్లు తీసినా అప్పటికే ఆసీస్ విజయం ఖాయమైంది. దీంతో పవర్ ప్లేలోనే వికెట్లు తీస్తేనే గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. తుది జట్టు కూర్పుపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. గత రెండు మ్యాచ్‌లలోనూ భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగిం ది. రెండో టీ20లో ఈ వ్యూహం వర్కౌట్ కాలేదు.
పైగా హర్షిత్ రాణా కోసం టీ20ల్లో బెస్ట్ బౌలర్‌గా ఉన్న అర్షదీప్‌సింగ్‌ను బెంచ్‌పైనే కూర్చోబెట్టడం విమర్శలకు దారితీసిం ది. అయినప్పటకీ కోచ్ గంభీర్ హర్షిత్ రాణాకే మొగ్గుచూపుతున్నాడు. మెల్‌బోర్న్‌లో హర్షిత్ 35 పరుగులు చేయడంతో మూడో టీ20కి కొనసాగించే అవకాశాలే ఎక్కువ. దీంతో అర్షదీప్‌ను తీసుకోవాలంటే కుల్దీప్ లేదా అక్షర్ పటేల్‌లో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా జట్టులోనూ కీలక మార్పులు జరిగాయి. విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ జట్టుతో చేరాడు.దీంతో మిఛెల్ ఓవెన్ లేదా షార్ట్‌లో ఒకరు తప్పుకోనున్నారు. అలాగే హ్యాజిల్‌వుడ్ దూరమవడంతో సీన్ ఎబోట్ లీడ్ చేసే అవకాశముంది. ఇక పిచ్ విషయానికొస్తే హోబార్ట్‌లో ఎక్కువగా భారీస్కోర్లు నమోదవుతూ ఉంటాయి.
భారత్ తుది జట్టు(అంచనా):
అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్. అక్షర్ పటేల్, శివమ్ దూబే, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్/అర్షదీప్ సింగ్,వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా):
మిఛెల్ మార్ష్ (కెప్టెన్), హెడ్, జోస్ ఇంగ్లీస్, డేవిడ్, మాక్స్‌వెల్, మిఛెల్ ఓవెన్/షార్ట్, స్టోయినిస్, బార్ట్‌లెట్, ఎల్లిస్, ఎబోట్, కున్నేమన్