02-11-2025 12:00:00 AM
ముంబై, నవంబర్ 1 : మహిళల వన్డే క్రికెట్‌కు కొత్త చాంపియన్ రాబోతోంది. ఆదివారం జరగబోయే మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆతిథ్య భారత్, సౌతాఫ్రికా తలపడబోతున్నాయి. ఇప్పటి వరకూ ఇరు జట్లూ వరల్డ్‌కప్ గెలవలేదు. దీంతో ఎవరు గెలిచినా కొత్త చాంపియన్ చూడబోతున్నాం. ఈ మెగా టోర్నీలో రెండు జట్ల ప్రయాణం దాదాపు ఒకలాగే సాగింది. ముఖ్యంగా భారత జట్టు వరుసగా రెండు విజయాలతో టోర్నీని ఘనంగా మొదలుపెట్టింది.
తర్వాత హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడడమే కాదు సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. అయితే డూ ఆర్ డై మ్యాచ్‌లో మాత్రం దుమ్మురేపి కివీస్‌ను చిత్తు చేసింది. ఇక అన్నింటికంటే మించి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చి ఫైనల్‌కు దూసుకొచ్చింది.
ఇప్పుడు సొంతగడ్డపై జరుగుతున్న టైటిల్ పోరులో భారత జట్టే ఫేవరెట్. అలా అని దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమే. ఎందుకంటే లీగ్ స్టేజ్‌లో సఫారీల చేతిలోనే భారత్ ఓడిపోయింది. దాదాపు గెలిచి మ్యాచ్‌ను డెత్ ఓవర్స్ వైఫల్యంతో చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో సఫారీలను ఆల్‌రౌండ్ ప్రదర్శనతోనే మట్టికరిపించాల్సి ఉంటుంది.
ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు
బ్యాటింగ్‌లో టీమిండియా బాగానే రాణిస్తోంది. ప్రతీకా రావల్ ప్లేస్‌లో వచ్చిన షెఫాలీ వర్మ గత మ్యాచ్‌లో నిరాశపరిచింది. దీంతో ఫైనల్లో షెఫాళీ విరుచుకుపడితే మాత్రం భారీస్కోరు ఖాయం. ఆమె ఇచ్చే ఆరంభంపైనే భారీస్కోర్ ఆధారపడి ఉంటుంది. అలాగే మరో ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్, దీప్తి శర్మ కూడా ఫామ్‌లో ఉన్నారు.
ఇక ఆసీస్‌పై సెమీస్‌లో ఆడిన ఇన్నింగ్స్‌తో జెమీమా రోడ్రిగ్స్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆమెతో పాటు రిఛాఘోష్ కూడా చెలరేగితే ఇక తిరుగుండదు. అలాగే కెరీర్‌లో చివరి ప్రపంచకప్ ఆడుతున్న హర్మన్‌ప్రీత్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడితే అంతకమించింది ఏముంటుంది.
బౌలర్లు పూర్తిగా కుదురుకోవాల్సిందే
ఈ ప్రపంచకప్‌లో టీమిండి.ఆ ఫాస్ట్ బౌలింగ్ కాస్త టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా డెత్ ఓవర్స్‌లో మన పేసర్లు తేలిపోతున్నారు. లీగ్ స్టేజ్‌లో వరుసగా మూడు ఓటములకూ కారణం డెత్ బౌలింగే. ఈ నేపథ్యంలో క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిందే. అటు స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రీచరణి, అమన్‌జోత్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నారు.
ఓవరాల్‌గా డెత్ ఓవర్స్‌లో ప్రత్యర్థిని కట్టడి చేయగలిగితే సగం గెలిచినట్టే. ఇదిలా ఉంటే క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ ఎంతకీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మెగాటోర్నీలో భారత్ ఫీల్డింగ్ మాత్రం పేలవంగా ఉంది. పలు కీలక క్యాచ్‌లు వదిలేయడం, మిస్ ఫీల్డ్స్ కొంపముంచుతున్నాయి. ఫైనల్లో మాత్రం ఫీల్డింగ్ మెరుగుపరుచుకోకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.
మరోవైపు సౌతాఫ్రికాను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. చోకర్స్ ముద్రను చెరుపేసుకోవాలనే తాపత్రయంలో ఉన్న సఫారీలు సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించారు. భారత్ తరహాలోనే భారీస్కోరు సాధించి ఇంగ్లీష్ టీమ్‌ను ఇంటికి పంపించారు. కెప్టెన్ లారా వాల్వార్ట్ సౌతార్రికా ప్రధాన బలం.
సారథిగానే కాకుండా బ్యాట్‌తోనూ అదరగొడుతున్న ఆమె ఈ ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 470 రన్స్ చేసింది. సెమీస్‌లో 169 పరుగులతో విధ్వంసం సృష్టించింది. సఫారీ కెప్టెన్‌ను త్వరగా ఔట్ చేస్తేనే భారత్‌కు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. అలాగే ఆల్‌రౌండర్ మరిజెన్నా కాప్ సఫారీ జట్టులో మరో కీలక ప్లేయర్. అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ మంచి ఫామ్‌లో ఉన్న కాప్‌ను అడ్డుకోవాల్సిందే.
గత రికార్డులు
గత రికార్డుల్లో భారత్‌దే పైచేయిగా ఉంది. వన్డేల్లో ఇరు జట్లు 34 సార్లు తలపడితే భారత్ 20 మ్యాచ్‌లలో గెలిచింది. 13 మ్యాచ్‌లలో సౌతాఫ్రికా విజయం సాధిస్తే ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక వన్డే ప్రపంచకప్‌లో 7 సార్లు తలపడితే భారత్ ఐదింటిలోనూ, దక్షిణాఫ్రికా రెండుసార్లు గెలిచాయి.
పిచ్ రిపోర్ట్
నవీ ముంబై పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. మంచు ప్రభావం కూడా కీల కం కానుండడంతో ఛేజింగ్ జట్లే ఎక్కువసార్లు గెలిచాయి. అయితే ఫైనల్లో ఒత్తిడి ఎక్కువగానే ఉం టుం ది కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గుచూపొచ్చు. ఇక మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ నిలిచిపోయినా రిజర్వ్ డే ఉండడంతో సోమవారం నిర్వహిస్తారు.
భారత తుది జట్టు(అంచనా)
స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిఛా ఘోష్, అమన్‌జోత్ కౌర్, స్నేహా రాణా,క్రాంతి గౌడ్, శ్రీచరణి, రేణుకా సింగ్
సౌతాఫ్రికా తుది జట్టు (అంచనా)
లారా వాల్వార్ట్(కెప్టెన్), బ్రిట్స్, బోస్చ్, సునే లూస్, మరిజన్నే కాప్, సినాలో జఫ్తా, డెర్క్‌సన్, ట్రియోన్, డిక్లార్క్, కాకా, ఎంలబా