16-07-2025 12:00:00 AM
అనుపమ పరమేశ్వరన్ టైటిల్ రోల్‌లో, సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జానకి వీ వర్సెస్ స్టేట్ అఫ్ కేరళ’. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కోర్ట్‌రూమ్ డ్రామాను కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జే ఫణీంద్రకుమార్ నిర్మించారు. దివ్య పిళ్లు, శ్రుతి రామ చంద్రన్, అస్కర్ అలీ, మాధవ్ సురేశ్ గోపి, బైజు సంతోష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా టైటిల్ విషయమై కొంతకాలంగా మలయాళ ఇండస్ట్రీలో కొనసాగిన వివాదం ఇటీవలే సద్దుమణిగింది. మొదట ఈ సినిమాకు ‘జానకి వర్సెస్ స్టేట్ అఫ్ కేరళ’ అనే టైటిల్‌ను మేకర్స్ ప్రకటించగా, దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సూచనల మేరకు నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌ను మార్చడానికి అంగీకరించారు. ‘జానకి వీ వర్సెస్ స్టేట్ అఫ్ కేరళ’గా టైటిల్ మార్చారు.
ఇక విడుదల తేదీ ప్రకటించడమే తరువాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) అనే యువతి లైంగిక దాడికి గురై, న్యాయం కోసం ఆమె చేసే పోరాటమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది.