17-07-2025 04:41:38 PM
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
చిట్యాల,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం చిట్యాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను (కేజీబీవీ) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి గదిని పరిశీలించి విద్యార్థులతో హిందీ పాఠం చదివించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో బాగా రాణించాలంటే ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహించాలని ప్రిన్సిపల్ కు సూచించారు.
విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండాలని,తల్లిదండ్రులు నుండి దూరం వచ్చి చదువుకుంటున్నారని, విద్యార్థులను మన పిల్లలుగా భావించి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్టోర్ రూము, వంటగదిని పరిశీలించి వంట గది నిర్వహణను స్వయంగా ఫోటో తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఎంపీడీవో జయశ్రీ, ప్రిన్సిపల్ సుమలత, అధికారులు పాల్గొన్నారు.