27-11-2025 12:09:48 AM
సిబ్బందిని అభినందించిన కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో సోమవారం రోజున జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు కేవలం ఒక్కరోజులోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో ఆ ప్రాంతంలో భారీ చర్చకు దారితీసింది. నార్త్ రూరల్ సర్కిల్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను సమగ్రంగా విశ్లేషించి నిందితుడి కదలికలను గమనించి నిందితుడిని నిజామాబాద్ బస్టాండ్ ప్రాంతంలో పట్టుకున్నారు.
అరెస్ట్ అయిన నిందితుడు మోస్రా గ్రామానికి చెందిన కుమరం @ పాండవల సాగర్ (37)గా గుర్తించారు. విచారణలో నిందితుడు గృహ నిర్మాణానికి డబ్బులు అవసరమవడం తో మల్కాపూర్ గ్రామానికి చెందిన తన మేనకోడలు ఆకుల అనంత ఇంటికి వెళ్లి, ఆమె ఒంటరిగా ఉన్న సమయం గమనించి గొంతునులిమి హత్య చేసి బంగారు ఆభరణాలు దొంగి లించినట్లు ఒప్పుకున్నాడు. దొంగిలించిన ఆభరణాలలో కొంత భాగాన్ని బోధన్ ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి రూ:12,500 రుణం పొందగా, మిగతా ఆభరణాలను తనతోనే దాచుకున్నాడు.
పోలీసులు నిందితుడి వద్ద నుంచి బంగారు మాటి 1.5 గ్రా, పుస్తెలు తాడు 13.5 గ్రా, కీప్యాడ్ మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణను ఎసిపి రాజా వెంకట్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్ నేతృత్వంలో క్రైమ్ టీమ్, నవీపేట్ పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా కేసును చేదించారు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వారిని అభినందించారు.