ఎండలతో కార్మికుల ప్రాణాలకు ముప్పు
l ప్రపంచవ్యాప్తంగా ఏటా 18 లక్షలకుపైగా మృతి
l ఐఎల్‌ఓ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా కార్మికులపై అధిక ఉష్ణోగ్రతలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. విపరీతమైన ఎండల ప్రభావం తో ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 18 లక్షలకుపైగా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాకుండా 228 కోట్ల మంది పని ప్రదేశాల్లో గాయాలపాలవుతున్నారు. 21 లక్షల మంది దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఎన్స్యూరింగ్ సేప్టీ అండ్ హెల్త్ వర్క్ ఇన్ ఏ క్లుమైట్ చేంజ్ పేరుతో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) విడుదల చేసిన నివేదికలో ఈ అంశా లు వెలుగుచూశాయి. నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం కార్మికులు పని ప్రదేశంలో ఎండలను ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. భారత్, అమెరికా, ఆఫ్రికా, మధ్య తూర్పు దేశాల్లోనే ఎక్కువ మంది కార్మికులు అధిక ఉష్ణోగ్రతల కారణంగా మూత్రపిండాల వైఫల్యం బారిన పడుతున్నారు.
తీవ్ర ఎండల నుంచి కార్మికులను రక్షిచేందుకు ప్రపంచదేశాలు వాతవరణ మార్పు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య విధానాలను రూపొందించాలని, వాటిని పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్‌తో ఏకీకృతం చేయాలని నివేదిక సూచించింది. అదే విధంగా పురుగుల మందు కారణంగానూ ఏటా సుమారు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని నివేదిక వెల్లడించింది. పని ప్రదేశాల్లో వాతావరణ కాలుష్యం కారణంగా అతినీల లోహి త కిరణాల రేడియేషన్‌కు గురై చర్మ క్యాన్సర్‌తో 18,960 మంది, వెక్టర్ బోర్న్ డిసీజ్ కారణంగా మరో 15,170 మంది మరణిస్తున్నారని తన నివేదికలో స్పష్టం చేసింది. కార్మికులు క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాస కోశ సమస్యలు, మూత్రపిండాల పనితీరు మందగించడం, మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగాలేక పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే శ్రామికుల సంఖ్య తగ్గుతుందని, దేశాల ఉత్పత్తి శక్తి తగ్గి కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపుతుందని తన నివేదికలో స్పష్టం చేసింది.






