calender_icon.png 16 November, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెండర్లు పిలువకుండానే పనులు!

16-11-2025 12:39:57 AM

  1. పూర్తికావస్తున్న సమయంలో టెండర్లు
  2. మంచిర్యాల కార్పొరేషన్‌లో వెలుగుచూసిన వైనం

మంచిర్యాల, నవంబర్ 15 (విజయక్రాం తి): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో అధికారులు ఆడిందే ఆటలా సాగుతోంది. ఎక్కడై నా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టాలం టే ముందుగానే టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడం, టెండర్ దక్కించుకున్న కాం ట్రాక్టర్ పనులు చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ మంచిర్యాలలో అధికారుల రూటే వేరు.

ఇప్పటికే దాదాపు పూర్తి కావస్తున్న పనులకు టెండర్లు పిలిచి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కొత్త టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఎక్కడ పనులు చేపట్టాలి అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

పూర్తయిన పనులకు టెండర్లు!

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో రెండు ప్రాంతాలలో జనరల్ ఫండ్ వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టాలని ఈ నెల 10న రెండు పనులకు టెండర్ పిలిచారు. దాఖలు చేయడానికి ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా టెండ ర్ పిలిచిన పట్టణంలోని జన్మభూమి నగర్ లో రాజేశ్వర్ ఇంటి నుంచి జన్మభూమి నగర్ రోడ్డును కలుపుతూ సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణ పనులు ఇప్పటికే కొనసాగుతు న్నాయి.

రూ.5,88,259 అంచనా వ్యయం తో కార్పొరేషన్ అధికారులు టెండర్ పిలిచా రు. కానీ ఇప్పటికే ఈ రోడ్డుపై వెట్ మిక్స్ ను వేశారు. దాదాపు పనులు పూర్తికానున్నాయి. మరోవైపు మంచిర్యాల బైపాస్ రోడ్డును ఆనుకొని ఉన్న ఎంసీ రాజు ఇంటి నుంచి బైపాస్ రోడ్డు వరకు రూ.16,61,099తో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి టెండర్ పిలిచారు. కానీ ఇప్పటికే డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రోడ్డు పనుల కోసం ఇక్కడ కూడా వెట్ మిక్స్ వేశారు. చేసిన పనులకు టెండర్లు పిలువడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

టెండర్లను రద్దు చేయాలి: బీఆర్‌ఎస్

పూర్తయిన పనులను టెండర్‌కి పిలిచారని, ఆ టెండర్‌లని వెంటనే రద్దు చేయాలని శనివారం కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్‌కి బీఆర్‌ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. పనులు ప్రారంభానికి ముందు టెండర్లు పిలిచి పనులు చేపట్టాలి కానీ ఇదేంటని వారు ప్రశ్నించారు.

వినతిపత్రం అందజేసిన వారిలో బీఆర్‌ఎస్ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, మాజీ కౌన్సిలర్లు తోట తిరుపతి, ఎడ్ల శంకర్, శ్రీపతి శ్రీనివాస్ తదితరులున్నారు.