16-08-2024 12:32:55 AM
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సుల్లో కుట్లు అల్లికలే కాదని, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు కూడా వేసుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బస్సులో అల్లం ఎల్లిపాయలు ఏరితే తప్పా అని సీతక్క అంటున్నారని, తమకు ఈ విషయం తెలియక బస్సులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మామూలుగా నడిపిందని ఎద్దేవా చేశారు. మనిషికో బస్సు పెట్టినా తామ వద్దనమని, కుటుంబమంతా బస్సులో కుట్లు, అల్లికలు, బ్రేకు డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చన్నారు. గురువారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మంచి జరిగితే రేవంత్‌రెడ్డి ఖాతాలో, చెడు జరిగితే కేసీఆర్ ఖాతాలో వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పూర్తి చేసిన పనులన్నింటికీ క్రెడిట్ తీసుకోవడం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. కేసీఆర్ పూర్తిచేసిన సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కటింగ్ చేసి తామే పూర్తి చేసినట్లు రేవంత్‌రెడ్డి చెప్పుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు గురించి క్రెడిట్ తీసుకునేందుకు ముగ్గురు మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని ఎగతాళి చేశారు. నిరుద్యోగుల నుంచి తప్పించుకునేందుకు జాబ్ క్యాలెండర్ పేరుతో జాబ్ లెస్ క్యాలెండర్ ప్రకటించారన్నారు.
రైతులకూ కాంగ్రెస్ నాయకులు ఎన్నో తప్పుడు మాటలు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు జూలై నాటికి రైతుబంధు పడేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును ఎగ్గొట్టిందన్నారు. ఇప్పుడు రుణమాఫీ పేరుతోనే డ్రామాలు ఆడుతోందన్నారు. రూ.2,183 ఉన్న వడ్లకు రూ.500 బోసన్ ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు సన్నాలకు ఇస్తామని చెప్పడంపై కేటీఆర్ మండిపడ్డారు. ఇవన్నీ ఇప్పడిప్పుడే రైతులకు అర్థమవుతున్నాయన్నారు. ఆడబిడ్డలకు కూడా ఎన్నెన్నో మాటలు చెప్పారని, తులం బంగారం కాదు కదా..! తులం వెండికి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. వృద్ధులకూ రూ.4 వేలు ఇస్తామని ఎగనామం పెట్టారన్నారు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అని ప్రచారం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఎక్కడ చూసినా రేవంత్‌రెడ్డి ఫ్యామిలీనే కనపడుతోందన్నారు.
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తాను లాయర్లతో మాట్లాడటానికి ఢిల్లీకి వెళితే బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకు న్నారని తప్పుడు చేస్తున్నారన్నారు. బీజేపీతో ఒప్పందం ఉంటే తమ ఇంటి ఆడబిడ్డ 150 రోజులు జైల్లో ఉండేదా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.1లక్ష రుణమాఫీ చేస్తేనే రూ.17వేల కోట్ల ఖర్చు అయ్యిందని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు రూ.2 లక్షల రుణమాఫీ రూ.18వేల కోట్లతో ఎలా అయ్యిందో చెప్పాలన్నారు. ఇది ముమ్మాటికి రైతులకు ద్రోహం చేయడమేనన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉపఎన్నిక రావడం ఖాయమని, అందులో రాజయ్య గెలుపు తథ్యమని కేటీఆర్ జోస్యం చెప్పారు.