16-08-2024 12:32:33 AM
చేవెళ్ల, ఆగస్టు 15: క్యాన్సర్, పక్షవాతం బాధితులు, మానసిక వైకల్యం ఉన్న పిల్లల కోసం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన పాలియేటివ్ కేర్ సెంటర్ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడ ఆరు నెలలుగా డాక్టర్ లేకపోవడంతో వైద్యం అందక షేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు నర్సులు, ఓ ఫిజియోథెరఫిస్ట్ మాత్రమే సెంటర్‌ను నెట్టుకొస్తున్నారు. ఇందులోనూ ఫిజియోథెరఫిస్ట్ రెగ్యులర్‌గా రారని పేషెంట్లు ఆరోపిస్తున్నారు. సదరు ఫిజియోథెరపిస్ట్ ప్రతి గురువారం పక్కనే ఉన్న సీహెచ్‌సీ (కమ్యునిటీ హెల్త్ సెంటర్)లో నిర్వహించే ఎల్డర్లీ కేర్ క్యాంప్‌లో పాల్గొని వృద్ధులకు చికిత్స అందించాల్సి ఉంటుంది. కానీ, అక్కడికి కూడా వెళ్లకుండానే ఓపీ డేటా, ఒక ఫొటో తీసుకొని పై అధికారులను మేనేజ్ చేస్తున్నారని అక్కడి సిబ్బంది చెబుతున్నారు.
2017లో సెంటర్ ప్రారంభం..
ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేవెళ్లలో 2017 అక్టోబర్‌లో ఆలన పాలియేటివ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇందులో నేషనల్ హెల్త్ మిషన్ సహకారంతో ఒక డాక్టర్, ఐదుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక ఫిజియోథెరఫిస్ట్, డ్రైవర్‌తో పాటు నలుగురు ఆయాలను నియమించారు. వీరు పేషెంట్లకు పక్కాగా ట్రీట్ మెంట్ అందించేవారు. పేషెంట్ శరీరంలో ఏదైనా భాగానికి క్యాన్సర్ సోకి పాడైతే అక్కడ ట్రీట్‌మెంట్ చేసి అందులో నుంచి వచ్చే పురుగులను కూడా లెక్కించి రికార్డు చేసుకునేవారు. ఆసుపత్రికి రాలేని స్థితిలో ఉన్న పేషెంట్ల ఇంటికి అంబులెన్స్‌లో ఒక డాక్టర్, ఒక ఫిజియోథెరఫిస్ట్, ఒక నర్సు, ఇద్దరు కౌన్సిలర్లు (ఏఎన్‌ఎంలు) వెళ్లి ట్రీట్‌మెంట్ చేసేవారు.
ప్రభుత్వం టేకోవర్ చేసినప్పటి నుంచి సమస్యలే..
ఆలన పాలియేటివ్ కేర్ సెంటర్‌ను 2020లో ప్రభుత్వం టేకోవర్ చేసింది. అప్పటి వరకు బాగానే ఉన్న సెంటర్‌కు సమస్యలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఒక ఫిజియోథెరఫిస్టు, ముగ్గురు ఆయాలు మాత్రమే ఉన్నారు. ఈ సెంటర్‌లో ఇప్పటి వరకు 6 వేల మందికి పైగా పేషెంట్లు నమోదు కాగా.. మరణించిన వారు పోను ప్రస్తుతం 2,700 మంది పేషెంట్లు ఉన్నారు. ఇందులో 500 మంది క్యాన్సర్, 106 మంది మానసిక వైకల్యం ఉన్న పిల్లలు, మిగతా వారు పక్షవాతం పేషెంట్లు ఉన్నారు.
అయితే, ఫిబ్రవరి నుంచి డాక్టర్ లేకపోవడం, కేవలం ఇద్దరు స్టాఫ్‌నర్సులు మాత్రమే ఉండడంతో వీరికి సరైన ట్రీట్‌మెంట్ అందడం లేదు. ఇద్దరు నర్సుల్లో పగటి సమయంలో ఒకరు, రాత్రి సమయంలో ఒకరు విధులు నిర్వహిస్తున్నారు. నర్సులలో ఎవరైనా లీవ్ తీసుకుంటే పేషెంట్లను పట్టించుకునే దిక్కు లేకుండా పోతోంది. కనీసం పక్కనే ఉన్న సీహెచ్‌సీ కూడా పట్టించుకోవడం లేదు. ఎమర్జెన్సీ ఉందని స్లున్ పెట్టించుకునేందుకు సీహెచ్‌సీకి వెళ్తే అక్కడి నర్సులు కనీసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదని ఓ పేషెంట్ వాపోయారు.
మెయింటనెన్స్ నిధుల్లో చేతివాటం..
స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో మెయింటనెన్స్ కోసం ప్రతి నెల రూ. 1.05 లక్షలు వచ్చేవి. వీటితో అంబులెన్స్(మినీ వ్యాన్) డీజిల్, డ్రైవర్, ఆయాల శాలరీ, ధోబీ, స్టేషనరీ, వాటర్, కరెంట్ బిల్లులతో పాటు పేషెంట్లకు పాలు, బ్రెడ్లు, అరటి పండ్లు, గుడ్డు, అన్నంతో పాటు రాగి జావా వంటి ఫుడ్ పెట్టేవారు. సెంటర్ ఇన్‌చార్జి సమర్పించే బిల్లులను బట్టి ప్రతి నెల రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఫండ్ ఇస్తున్నామని డీఎంహెచ్‌వో చెబుతున్నారు.
ప్రస్తుతం ఫుడ్ పెట్టట్లేదు.. 104 డ్రైవర్‌ను వాడుతున్నారు. ముగ్గురు ఆయాలకు రూ.30 వేలు, ధోబీ రూ.3 వేలు, అంబులెన్స్ డీజిల్‌కు రూ.10 వేలు, కరెంట్, వాటర్, స్టేషనరీ, కరెంట్ బిల్లులకు కలిసి మరో రూ.10 వేలు ఖర్చు పెట్టినా రూ.60 వేలకు మించదు. కానీ రూ.లక్ష వరకు బిల్లులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సెంటర్ ఇన్‌చార్జితో పాటు జిల్లా స్థాయి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డాక్టర్‌ను నియమించాలని కోరాం..
గతంలో ఇక్కడ పనిచేసిన డాక్టర్ రిజైన్ చేసి వెళ్లిపోయారు. మరో వైద్యుడు కావాలని పై అధికారులను కోరాం. అక్కడి నుంచి అనుమతి రాగానే కొత్త డాక్టర్‌ను నియమిస్తాం.
వెంకటేశ్వర్ రావు, డీఎంహెచ్‌వో