25-10-2025 07:40:15 PM
వేములవాడ రూరల్ మండలం ఫజల్ నగర్ లో ఘటన కుటుంబంలో తీరని విషాదం..
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): వేములవాడ రూరల్ మండలం ఫజల్ నగర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు తన స్వంత వ్యవసాయ బావిలో పడి కీసరి అనిల్ అనే యువ రైతు మృతిచెందాడు. శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరగగా, శనివారం ఉదయం గ్రామస్తులు అతడి మృతదేహాన్ని బావి నుండి వెలికి తీశారు. వివరాల్లోకి వెళ్తే.. ఫజల్ నగర్‌కు చెందిన కీసరి అనిల్ శుక్రవారం రాత్రి పొలం పనుల నిమిత్తం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఆయన బావిలో జారిపడినట్లు తెలుస్తోంది.
రాత్రంతా బావిలో ఉండగా, శనివారం ఉదయం అనిల్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెతకగా, బావిలో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే గ్రామస్తులు కలిసి మృతదేహాన్ని బయటకు తీశారు. యువ రైతు అనిల్ అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు అనిల్‌కు భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భర్త మృతితో భార్య, పిల్లలు గుండెలు పగిలేలా రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కుటుంబ పెద్దను కోల్పోయి అనాథలైన చిన్నారుల దీనగాథ స్థానికులను కలచివేసింది. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబానికి అనిల్ మరణం తీరని లోటు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.