calender_icon.png 31 December, 2025 | 4:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ దందాలో యువతి అరెస్ట్

31-12-2025 12:00:00 AM

  1. గోవా టు హైదరాబాద్ లేడి పెడ్లర్
  2. నైజీరియన్ ముఠాతో లింకులు.. ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ సరఫరా
  3. పాత నేరస్తురాలిగా గుర్తింపు.. మరోసారి కటకటాల్లోకి..

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 30 (విజయక్రాంతి):నగరంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. కేటుగాళ్లు కొత్త దారుల్లో దందా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా గోవా నుంచి హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్ తరలిస్తున్న ఓ లేడీ పెడ్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌కు చెందిన హస్సా అనే యువతి ఈ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

విలాసాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఆమె డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు విచా రణలో తేలింది.పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన హస్సా 2024 డిసెంబర్‌లో గోవా వెళ్లినప్పుడు అక్కడ మొదటిసారి ఎండీఎంఏ రుచి చూసింది. క్రమంగా మాదకద్రవ్యాలకు బానిసగా మారింది. ఆ మత్తు నుంచి బయటపడలేక, అదే సమయంలో తన ఖర్చుల కోసం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆమె డ్రగ్స్ పెడ్లర్‌గా అవతారమెత్తింది.

గోవా కేంద్రంగా పనిచేస్తున్న నైజీరియన్ డ్రగ్ మాఫియాతో హస్సా సంబంధాలు ఏర్పరచుకుంది. వారి వద్ద తక్కువ ధరకు ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ వంటి ఖరీదైన డ్రగ్స్‌ను కొనుగోలు చేసి, వాటిని రహస్యంగా హైదరాబాద్‌కు తరలిస్తోంది. ఇక్కడ ఆమెకు పరిచయం ఉన్న యువతకు, ఇతర వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటోంది.ఈ ఏడాది మార్చి నుంచి హస్సా పలుమార్లు గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

ఈనెల 26న కూడా గోవాలోని సియోలిమ్, మాపూసా ప్రాంతా ల్లో ఆమె డ్రగ్స్ లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తాజా ట్రిప్ ముగించుకుని సరుకుతో నగరానికి రాగా, పక్కా సమాచారంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.హస్సాకు నేర చరిత్ర కొత్తేమీ కాదు. గతంలో గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఆమెపై కేసు నమోదైంది.

ఆ కేసులో జైలుకు వెళ్లిన ఆమె.. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చింది. నగరంలో ఆమె ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తోంది.. ఈ ముఠాలో ఇంకా ఎంతమంది ఉన్నారు.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని అధికారులు తెలిపారు.