24-07-2025 10:33:12 AM
గద్వాల, (విజయక్రాంతి): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడి ఇంటి ముందు యువతి ధర్నా చేసింది. రెండు రోజులుగా ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. బాధితురాలు ప్రియాంక తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ గౌడ్ హైదరాబాద్ లో 2023 లో కాంపీటీషన్ ఉద్యోగ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందన్నారు. తనను 2024లో వివాహం చేసుకున్నాడని, పోలీస్ ఉద్యోగం రావడంతో వివాహం చేసుకుంటానని నమ్మిస్తూ వచ్చాడని బాధితురాలు తెలిపింది.
పలుమార్లు పెళ్లి విషయం అడుగగా వాయిదా వేయడంతో ఈనెల 14న చిన్నోనిపల్లి గ్రామానికి చేరుకుని ఆ యువకుడితో పెళ్లి విషయం మాట్లాడగా.. అతని కుటుంబ సభ్యులు యువతితో వివాహానికి నిరాకరించారన్నారు. మరో 16న చిన్నోన్నిపల్లి గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను నిలదీయగా కొంత వాగ్వివాదం చోటు చేసుకుందని, యువకుడి సమీప బందువు నాపై దాడి చేయడంతో మనస్తాపానికి గురై ప్రేమించిన యువకుడి ఇంటి దగ్గరే నిద్ర మాత్రలు వేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నానన్నారు.. స్థానికులు గమనించి హుటాహుటిన గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారన్నారు. సంబంధిత గట్టు మండల పోలీసులు గద్వాల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వివరాలు సేకరించారన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన రఘునాథ్ గౌడ్ పై చీటింగ్ కేసు నమోదు అయిందన్నారు. ఇది ఇలా ఉండగా రఘునాథ్ గౌడ్ శాంతినగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.
విచారించి చర్యలు చేపడతాం : డీఎస్పీ మొగులయ్య
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ పై ఈనెల 17న గట్టు మండలం పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిందని డిఎస్పి మోగులయ్య తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని యువతి స్టేట్ మెంట్ ను రికార్డింగ్ చేసి, పూర్తిస్థాయిలో విచారణ అనంతరం చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపడతామన్నారు.