24-07-2025 10:25:49 AM
నాగార్జునసాగర్, విజయక్రాంతి: రాష్ట్ర విభజన తర్వాత నుంచి కృష్ణా, గోదావరి నదుల జల వాటాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంశం ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. నాగార్జునసాగర్ డ్యాం కుడికాల్వకు ఆంధ్రా అధికారులు బుధవారం నీటి విడుదల చేశారు. కృష్ణా నది బోర్డు అనుమతులతో మాత్రమే నీటి విడుదల చేయ ల్సి ఉండగా, కృష్ణా రివర్ బోర్డు ఇటువంటి అనుమతి తీసుకోకుండా అక్రమంగా నీటి తరలిస్తుందని తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు నీటి చౌర్యం వ్యవహారం పై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో ఏపీ నీటి కుట్రలపై తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ కి లేఖ రాయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పట్లో ఏపీ సీఎం చంద్రబాబు- తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి భేటీ కాగా.. ఆ తర్వాత.. జగన్- కేసీఆర్ సమావేశమయ్యారు.. తాజాగా.. చంద్రబాబు- రేవంత్‌రెడ్డి మీట్ అయ్యారు. మూడు సార్లు కూడా విభజన సమస్యలే అజెండాగా సమావేశాలు నిర్వహించడం.. సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇంతకీ.. మూడు టర్మ్‌ల భేటీల్లో తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఏ మేరకు కొలిక్కి రాలేదు
ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు
ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు. దాంతో.. నాటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాల సీఎం సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. 2014- 2019 మధ్య అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నాటి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కలిపారు. జూన్ 23, 2015న హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఈ భేటీ జరిగింది. అప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య నీళ్లు-నిప్పుగా మారిన నాగార్జునసాగర్ డ్యామ్ విషయంలో చంద్రబాబు, కేసీఆర్‌లను కలిపి చర్చలు సాగేలా చేశారు నరసింహన్. నాడు నాగార్జునసాగర్ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య తలెత్తిన జల జగడాన్ని తీర్చడానికి అప్పటి గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకుని ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
విభజన సమస్యలపై కేసీఆర్- జగన్ మధ్య చర్చలు ..
ఇక.. 2019 ఎన్నికల్లో గెలిచాక, తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆనాటి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వానించారు. ఆ తర్వాత.. 28 మే, 2019న జగన్ దంపతులు హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే… 2019లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య మొదటిసారి విభజన సమస్యలపై చర్చ జరిగింది. జూన్ 26, 2019న హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసానికి జగన్ వెళ్లగా.. అప్పుడు ఇద్దరి మధ్య విభజన సమస్యలపై చర్చలు జరిగాయి. ఆ తర్వాత రెండోసారి కేసీఆర్‌ని కలిశారు నాటి ఏపీ సీఎం జగన్. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, నీటి పంపకాల గురించి చర్చించారు. జనవరి 13, 2020న కూడా హైదరాబాద్‌లో కేసీఆర్ నివాసానికి వెళ్లిన జగన్… నీటి పంపకాలు, గోదావరి జలాల తరలింపుపై కూడా ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయి.
చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
ఇదిలావుంటే.. తాజాగా మరోసారి తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ హైదరాబాద్ వేదికగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. ఏపీ, తెలంగాణ ప్రజలు ఆసక్తిగా చూసిన ఇద్దరు సీఎంల సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. సుమారు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో విభజన అంశాలతో పాటు.. పదేళ్లుగా చర్చలు జరుగుతున్నా తేలకుండా ఉన్న విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. ప్రధానంగా.. ఏపీ, తెలంగాణ మధ్య వివాదంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు వారాల్లో ఈ కమిటీ సమావేశం కానుంది. ఉన్నతస్థాయి కమిటీ భేటీ తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకుంటే.. మంత్రుల స్థాయిలో మరో కమిటీ ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. మొత్తంగా.. ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య విభజన సమస్యలే అజెండాగా సాగిన మూడు దఫాల భేటీల్లోనూ క్లారిటీ రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఐదేండ్లు గా కృష్ణా జలాల వివాదాలను పరిశీలిస్తే.. తొలుత పులిచింతల కేంద్రంగా వివాదం ముదిరి, అది కాస్తా ప్రాజెక్టులను బోర్డులకు అప్పగిస్తూ కేంద్రం గెజిట్ జారీ చేసే దాకా వెళ్లింది. అవ సరాల్లేకున్నా పులిచింతలలో జలవిద్యుత్తు ఉత్పాదన చేస్తూ నీటిని వృధాగా సముద్రంలోకి వదలడానికి తెలంగాణ కారణమవుతోందని ఏపీ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై పదే పదే ఒత్తిడి తేవడంతో రెండేళ్ల కిందట కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను ఆయా బోర్డులకు అప్పగించాలని కోరుతూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. అయితే గెజిట్ విడుదలైనా ప్రాజెక్టులేవీ బోర్డుల చేతికి వెళ్లలేదు. ఆ తర్వాత శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుత్తు ఉత్పాదనపై వివాదం నడిచింది.
తాజాగా నాగార్జునసాగర్ కేంద్రంగా వివాదం రాజుకుంది. నీటి పంపిణీపై కూడా వివాదం సమసిపోలేదు. 2015-16 వాటర్ ఇయర్‌కు ముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో జరిగిన సమావేశానికి తెలంగాణ సీఎం గైర్హాజరు కాగా, ఆ సమావేశంలో కృష్ణా జలాలను చెరిసగం కాకుండా 811 టీఎంసీల్లో 299 టీఎంసీలు (37 శాతానికే) తెలంగాణ ఒప్పుకోవడం విమర్శలకు తావిచ్చింది. అయితే ఆ నిర్ణయాలు క్రమంగా 2017 దాకా కొనసాగగా.. ఆ తర్వాత వాటా మేరకు నీటిని వాడుకోలేదు. దీంతో 37 శాతం నుంచి 34 శాతానికి తెలంగాణ అధికారులే కుదించుకుంటూ 66 శాతం ఏపీకి, 34 శాతం తెలంగాణకు ఇస్తే చాలని ఒప్పుకొన్నారు. 2015లో జరిగిన ఒప్పందం ఆ ఒక్క వాటర్ ఇయర్‌కే పరిమితమైనా 2022-23 దాకా కొనసాగింది. 2023-24 వాటర్ ఇయర్‌లో కృష్ణా నీటి పంపకాల వివాదం తేలలేదు. నీటిని పంచే బాధ్యతను అపెక్స్ కౌన్సిల్‌కు అప్పగిస్తూ బోర్డు తీర్మానం చేసింది. ఈలోగా త్రిసభ్య కమిటీ తెలుగు రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని బోర్డు తీర్మానించింది
నాగార్జునసాగర్ డ్యాం కుడికాల్వకు ఆంధ్రా అధికారులు బుధవా రం నీటి విడుదల చేశారు. కృష్ణా నది బోర్డు అనుమతులతో మాత్రమే నీటి విడుదల చేయ ల్సి ఉండగా, కృష్ణా రివర్ బోర్డు అనుమతులను వారు తీసుకున్నట్లు వారికి ఎటువంటి సమాచారం లేదు తెలంగాణకు చెందిన నాగార్జునసాగర్ డ్యాం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు శ్రీశైలం డ్యాం నిర్వహణ ఆంధ్రాకు, నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ తెలంగాణకు అప్పగించారు. 2023 నవబంర్ 30న ఆంధ్రా అధికారులు నాగార్జునసాగర్ డ్యాంపైకి పోలీస్ బలగాలతో ప్రవేశించి 13వ గేట్ నుండి 26వ గేట్ వరకు తమ అధీనంలోకి తీసుకుంటూ, కుడికాల్వ నిర్వహణను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆంధ్రా అధికారులు తమకు కావాల్సినప్పుడు, కేఆర్‌యాంబీ సూచనలు కూడా పాటించకుండా కుడికాల్వకు నీటి విడుదలను చేపడుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పాలకులు నాగార్జునసాగర్ డ్యాంపై ఉన్న పరిస్థితిని చక్కదిద్దడంలో పూర్తిగా విఫలం అవ్వడమే కాకుండా ఆంధ్రా పాలకులకు వత్తాసు పలుకుతోంది రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు.