25-10-2025 08:26:06 PM
ఆందోళన చేసిన మృతిని కుటుంబీకులు
నారాయణఖేడ్: బైక్ పై వెళ్తున్న క్రమంలో రోడ్డుపై గుంతల కారణంగా రోడ్డు పక్కన ఉన్న బావిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మనూరు మండలం మైకోడు గ్రామానికి చెందిన దత్తు(40) మైకోడు గ్రామం నుండి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో ఊరు శివారులో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన గల బావిలో పడిపోవడం జరిగింది. కాసేపటికి చుట్టుపక్కల వారు అనుమానంతో పరిశీలించగా రోడ్డు పక్కన బైకు, చెప్పులు పడి ఉండడంతో ఎవరో బావిలో పడ్డారని స్థానికులు పేర్కొన్నారు. దీంతో మైకుడు గ్రామానికి చెందిన దత్తు అనే యువకుని బైక్ ఉండడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
అనుమానంతో బావిలో వెతుకడంతో అప్పటికే బావిలో పడి మృతి చెందిన దత్తు మృతదేహం లభ్యమైంది. దీంతో బావి నుండి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు పక్కన బావి ఉండడంతో పాటు రోడ్డు మార్గం సక్రమంగా లేని కారణంగానే తమ కుమారుడు మరణించడం జరిగిందని తల్లిదండ్రులు, బంధువులు, స్థానిక గ్రామస్తులు రోడ్డుపై కాసేపు ఆందోళన చేపట్టారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్థానిక నాయకులు స్పందించి గోతులమైన రోడ్డును బాగు చేయించాలని వారు డిమాండ్ చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.