17-11-2025 05:32:46 PM
ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కిష్టయ్య డిమాండ్..
కాటారం (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న పే స్కేల్ ను తపాలా ఉద్యోగులకు అమలు చేయాలని తపాలా ఉద్యోగుల సంఘం తెలంగాణ సర్కిల్ కార్యనిర్వాహక కార్యదర్శి కుడుదుల కిష్టయ్య డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సమన్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో తపాలా కార్యాలయం ఏర్పాటు చేస్తూ బ్రాంచి పోస్టుమాస్టర్ ను నియమించిందని గుర్తు చేశారు.
తపాలా శాఖలో బ్రిటిష్ ప్రభుత్వం నాటి చట్టాలు అమలులో ఉన్నందువల్ల ఉద్యోగులు నేటికీ వెట్టిచాకిరి చేస్తూ జీవితాలు వెల్లదీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆల్ ఇండియా గ్రామీణ బ్యాంకు సేవక్ ప్రతినిధుల సమావేశంలో కిష్టయ్యను తెలంగాణ సర్కిల్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయన పలు జిల్లాలలో పర్యటిస్తూ తపాల ఉద్యోగులను సంఘటితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.