17-11-2025 05:36:49 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఆసిఫాబాద్ పట్టణం సందీప్ నగర్ కు చెందిన షేక్ మున్నా తనకు పింఛను ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. సిర్పూర్ టి మండలం పూసిగూడ గ్రామానికి చెందిన గిరిజనులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అటవీ శాఖ సమస్య పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం గోలేటికి చెందిన గుగ్లవత్ దేవయ్య తన తండ్రి పేరిట ఉన్న భూమిని ఆయన మరణించినందున తన పేరిట విరాసత్ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. చింతలమనేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన యువకులు తమ గ్రామపంచాయతీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
సిర్పూర్ టి మండల కేంద్రానికి చెందిన దుర్గం నిర్మల తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. సిర్పూర్ టి మండలం పారిగాం గ్రామానికి చెందిన కొండగుర్ల కారుబాయి తన భర్త మరణించినందున డెత్ సర్టిఫికెట్ జారీ చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాగజ్ నగర్ పట్టణంలోని రిక్షా కాలానికి చెందిన ఫర్వీన్ సుల్తానా తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన పెద్దపల్లి లక్ష్మి తాను సాగు చేస్తున్న భూమికి పట్టా మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.