17-11-2025 04:59:16 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం స్థానిక ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. పది నెలలుగా పెండింగ్లో ఉన్న కోడిగుడ్ల బిల్లులు, జీతాలు, మెనూ బిల్లులు ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులు అప్పుల చేసి బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారని అన్నారు. కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం సరైనది కాదన్నారు.
అనంతరం మధ్యాహ్న భోజన కార్మిక సంఘం(సిఐటియు) జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేం అధికారంలోకి వస్తే పది వేలు వేతనం చెల్లిస్తామని చెప్పి మాతో ఓట్లు వేయించుకొని , అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వలన మాకు కిరాణా దుకాణంలో సరుకులు కూడా ఉద్దెర ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు కొత్తగా 60 ఏండ్లు నిండిన కార్మికులను తొలగిస్తామంటున్నారు. అది సరైనది కాదన్నారు.
గత ప్రభుత్వంలో ఐదు నెలల టిఫిన్ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలన్నారు. కోడిగుడ్లను, గ్యాస్ ను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు వచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రతి కార్మికురాలికి ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత,పెన్షన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పోసమ్మ, అమృత, శంకరమ్మ, లక్ష్మి, లచ్చవ్వ మల్లేశ్వరి,జానకి తదితరులు పాల్గొన్నారు.