29-10-2025 08:14:35 PM
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు కాగ్నానది వాగులో ఓ వ్యక్తి గల్లంతైన విషయాన్ని గమనించిన గ్రామస్తులు చాకచక్యంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి తాళ్ల సాయంతో వ్యక్తిని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడారు. తాండూరు మండలంలోని వీర్ శెట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాలాల మండలం అగ్గనూర్ గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి కాగ్నానదిలో కొట్టుకుంటూ వచ్చాడు.
వీర్ శెట్టిపల్లి గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్ద చేతులెత్తి.. మునుగుతూ.. తేలుతూ కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యారు. గ్రామస్తులు వాగులో దూకి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. వర్షపు నీరు ఉధృతికి దూరం పెరుగుతుండడంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి వాగులోకి తాడు విసిరి.. నర్సయ్యను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. వెంటనే 108కు సమాచారం అందించి తాండూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామ యువకులు చేసిన సాహసానికి గ్రామస్తులు అభినందించారు.