బోధన్ మాతృశ్రీ స్కూల్లో ఫీజుల వేధింపుల ఆరోపణలు!
ఫీజులు చెల్లించలేదని బస్సు నుంచి చిన్నారులను దింపేస్తున్నారని తల్లిదండ్రుల ఆవేదన
బోధన్, నవంబర్ 29 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని(Bodhan town) మాతృశ్రీ హైస్కూల్లో(Matrushri High School) ఫీజుల బకాయిల(Fee arrears) పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు చెల్లిస్తేనే స్కూల్ బస్సులో(School bus) ప్రయాణించేందుకు అనుమతిస్తామని చెబుతూ, కొంతమంది విద్యార్థులను(Students') బస్సు నుంచి దింపేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా తరగతి గదుల్లో విద్యార్థులను నిలబెట్టి తోటి పిల్లల ముందు అవమానిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ ముంపు, వడగళ్ల వానల కారణంగా సాలూర మండల రైతులు తీవ్రంగా పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల యాజమాన్యం కనీస మానవత్వం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక కొంతమంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లడం మానేస్తున్నారని పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, పాఠశాల హాస్టల్లో విద్యార్థులకు అందించే భోజనంలో పురుగులు కనిపిస్తున్నాయని పలువురు విద్యార్థులు విజయ క్రాంతి రిపోర్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హాస్టల్లో భోజన, వసతి సౌకర్యాలు సరిగా లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు ఇప్పటికే డే స్కాలర్లుగా మారిపోయారని విద్యార్థులు పేర్కొంటున్నారు.
స్వర్గీయ సిరిగిరి దిగంబర్ రావు విలువలతో నిర్మించిన విద్యాసంస్థ ప్రతిష్ఠను ప్రస్తుత యాజమాన్యం దెబ్బతీస్తోందని విద్యార్థి నాయకులు విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలలో సమగ్ర విచారణ చేపట్టాలని, విద్యార్థుల పట్ల వేధింపులు, హాస్టల్ భోజన నాణ్యతపై నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.