అణచివేతలకు వ్యతిరేకంగా HRF పోరాటం

29-11-2026 | 06:59pm

రాజకీయాలకు అతీతంగా మానవ హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలి

బోధన్, నవంబర్ 29 (విజయక్రాంతి): హక్కులు, సమానత్వం సాధనతో పాటు అణచివేతలు, వివక్షతలకు వ్యతిరేకంగా మానవ హక్కుల వేదిక(HRF) నిరంతరం పోరాటం చేస్తుందని రిటైర్డ్ జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడు డి. శంకరరావు(Shankara Rao) పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ (గొర్రెపాటి మాధవరావు) హాలులో ఆదివారం మానవ హక్కుల వేదిక జిల్లా ఎనిమిదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు గడ్డం గంగులు అధ్యక్షతన నిర్వహించారు.

హక్కుల ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంట్యాల రమేష్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సభ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డి. శంకరరావు మాట్లాడుతూ.. సమాజంలో మనిషికి మనిషిగా గౌరవం, సమాన హక్కులు లభించేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నేటికీ మతపరమైన, సామాజిక వివక్షత కొనసాగుతోందని, వీటికి వ్యతిరేకంగా HRF పోరాటం చేస్తోందని అన్నారు.

HRF రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ.. దేశంలో దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఎన్నో సామాజిక ఉద్యమాలు జరిగాయని గుర్తుచేశారు. వితంతు వివాహాల ప్రోత్సాహం, బాల్యవివాహాల నిర్మూలన వంటి ఉద్యమాలు రాజకీయాలకు అతీతంగా సాగాయని తెలిపారు. మానవ హక్కుల వేదిక కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. సమాజంలో స్వతంత్ర హక్కుల ఉద్యమాలు ఎప్పటికీ అవసరమని, మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చిన పాలకులే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దేశ సంపద, సహజ వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతున్నాయని, వాటి సమాన పంపిణీ కోసం ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని కోరారు.

HRF రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్.కె. హైమద్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రతి ఒక్కరికీ సమానత్వపు హక్కును కల్పించిందన్నారు. అయితే పాలకుల విధానాల కారణంగా ఓటు హక్కు పొందేందుకు కూడా ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరసత్వం, జీవించే హక్కు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా మైనార్టీలు, దళితులు, మహిళల హక్కులకు నష్టం కలిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఓటు హక్కు పరిరక్షణతో పాటు రాజ్యాంగ పరిరక్షణ కోసం హక్కుల కార్యకర్తలు, ప్రజలు మౌనంగా ఉండకుండా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు వి. సంఘం మాట్లాడుతూ.. ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న జంతర్ మంతర్‌లో నిరసనలకు ఆంక్షలు విధించడం, యూఏపీఏ చట్టం కింద హక్కుల కార్యకర్తలను జైళ్లలో నిర్బంధించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయని అన్నారు. పాలకుల అణచివేత ధోరణి మారాలని, ఉరిశిక్షల రద్దు కోసం హక్కుల సంఘాలు చేస్తున్న ఉద్యమాలకు ప్రజల మద్దతు అవసరమని పేర్కొన్నారు.

ఈ మహాసభలో హక్కుల కార్యకర్తలు మీనా సహాని, వేములపల్లి అరుణరేఖ, జగన్ జి. శ్రీనివాస్, రామా గౌడ్, ఆకుల సత్యనారాయణ, బాబా గౌడ్, అరుణ్, అన్వేష్, మారుతి తదితరులతో పాటు ప్రజా సంఘాల నాయకులు పరుచూరి శ్రీధర్, సాయి రెడ్డి, జి. భూమన్న, సిరుప లింగయ్య, నర్సారెడ్డి, వరదయ్య, గౌతమ్, పద్మాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

– గొంట్యాల రమేష్

జిల్లా ప్రధాన కార్యదర్శి, HRF

మరిన్ని వార్తలు