ఎగువ మానేరు, మల్లన్నసాగర్ ప్రాజెక్టులను సందర్శించిన ఆయకట్టు రైతులు
- మల్లన్నసాగర్ నుంచి అర టీఎంసీ నీటిని ఎగువ మానేరుకు విడుదల చేయాలని విజ్ఞప్తి
- డిసెంబర్ 25లోగా ప్రకటన చేయకపోతే నిరాహార దీక్ష చేపడతాం
గంభీరావుపేట, నవంబర్ 17 (విజయక్రాంతి ):సాగునీటి కోసం ఎగువ మానేరు, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల(Mallannasagar Project) నుంచి నీటి విడుదలకు(Water release) చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు డిమాండ్(Farmers' demand) చేశారు.
ఇందులో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుతో పాటు సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఆయకట్టు రైతులతో కలిసి నర్మాల మాజీ సర్పంచ్ ఏడబోయిన రాజు, రాజుపేట మాజీ సర్పంచ్ అల్లే సత్యం, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకునూరి రాజేందర్ తదితర నాయకులు సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఎగువ మానేరు నుండి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎగువ మానేరు జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.75 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని తెలిపారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టులో 12టిఏంసి నీరు నిల్వ ఉన్నందున అక్కడి నుండి అర టీఎంసీ నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా కూడేల్లి వాగులోకి, అక్కడి నుంచి ఎగువ మానేరులోకి విడుదల చేస్తే కుడి, ఎడమ కాలువల ద్వారా సుమారు 17 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ప్రాజెక్టుల్లో నీటి వినియోగంపై సాగునీటి కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 100 శాతం ప్రాజెక్టు ల్లో నీరు ఉంటే 94శాతం సాగుకు వాడొచ్చని, 1.8శాతం తాగుకు వాడాలని తెలిపిన నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు, సిరిసిల్ల జిల్లా ఈఈ స్పందించి ఈఎన్సీ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని కోరారు.
గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేలా మంత్రికి పరిస్థితిని వివరించాలని విజ్ఞప్తి చేశారు.డిసెంబర్ 25వ తేదీలోగా సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో మాజి మంత్రి,ఎమ్మెల్యే కేటీఆర్ సూచనలతో కలిసి మూడు మండలాల రైతులతో కలిసి నిరాహార దీక్ష చేపడతామని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో నాయకులు పంపరి మహేష్, గుండెల్లి కళ్యాణ్ కుమార్, రైతులు దాసరి చంద్రం తదితరులు పాల్గొన్నారు.