నలుపు తెలుపులకు ఆవల..
ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో పది రోజులపాటు ‘బియాండ్ బ్లాక్ అండ్ వైట్’ ప్రదర్శన
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రకృతి, జంతువుల చిత్రాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 31 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లో ‘ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ’లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘బియాండ్ బ్లాక్ అండ్ వైట్(Beyond Black and White)’ చిత్రకళా ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటున్నది. ఈ ప్రదర్శనలో ప్రముఖ ఆర్టిస్టు టీ శివాజీ, రాజు ఈపూరి, పామర్తి శంకర్, మోషే డయాన్, రాజేష్ నాగులకొండ, శ్రీనివాస్ (శ్రీనివాస రామ్) రూపొందించిన పెన్, ఇంక్, బ్రష్ చిత్రాలను ఉంచారు. నలుపు, -తెలుపు షేడ్స్‌లో గీసిన చూడచక్కనైన ప్రకృతి దృశ్యాలు, మూగజీవాల భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రాలు కళాభిమానుల మనసును దోచుకుంటున్నాయి. వెలుగునీడల కలయికలో రూపుదిద్దుకున్న ఈ చిత్రకళాఖండాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
పముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల శుక్రవారం ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. సినిమా అనేది ఒక శ్రేష్ఠమైన ఆర్ట్ అని, తనకు కళలంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కళాకారులు కేవలం నలుపు, తెలుపు (బ్లాక్ అండ్ వైట్) వర్ణాలు, రేఖల కలయికతోనే అద్భుతమైన భావాలను, సృజనాత్మక దృశ్యాలను ఆవిష్కరించడం అభినందనీయమని కొనియాడారు. గ్యాలరీలోని వివిధ చిత్రాలను శేఖర్ కమ్ముల ఆసక్తిగా తిలకించారు. ఈ చిత్రకళా ప్రదర్శన నవంబర్ 8 వరకు కళాభిమానులకు అందుబాటులో ఉంటుందని గ్యాలరీ నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 11:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సందర్శకులు ఉచితంగా ఈ ప్రదర్శనను వీక్షించవచ్చని పేర్కొన్నారు.