ఖబడ్దార్.. బీసీల జోలికొస్తే ఊరుకోం
2028లో బీసీలదే రాజ్యం!
టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న(TRP President Teenmar Mallanna) చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర శనివారం వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుని 38వ రోజుకు చేరుకుంది. 38వ రోజు పాదయాత్ర మిర్యాలగూడకు చేరుకోగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు వైద్యం వెంకటేశ్వరులు అధ్యక్షతన నిర్వహించిన కార్నర్ మీటింగ్లో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి బీసీలను, బీసీ ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘బీసీ ఉద్యోగులారా ధైర్యంగా ఉండండి.. బీసీల జోలికొస్తే ఖబర్దార్! ఎక్కడా అడుగు కూడా పెట్టలేరు!‘ అని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని తీవ్రంగా హెచ్చరించారు. మిర్యాలగూడ అసెంబ్లీని కచ్చితంగా బీసీల వశం చేసి, బీసీ బిడ్డనే ఎమ్మెల్యేగా గెలిపిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో ‘ఇంటికో కేసీఆర్‘ ని తయారు చేస్తామని చెప్పి, పాలనలోకి వచ్చాక ‘ఇంటికో తాగుబోతును‘ తయారు చేశారని మండిపడ్డారు.
జనాభాలో కేవలం 5.3% ఉన్న రెడ్డి, వెలమలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో దొంగతనంగా 10% రిజర్వేషన్లు కల్పించారని మల్లన్న మండిపడ్డారు. రాష్ట్రంలో 1,01,000 మంది ఇళ్లు లేక రోడ్లపై, 34,000 మంది గుడిసెలలో, 8 లక్షల మంది దళితులు రేకుల షెడ్లలో బతుకుతున్నారని సర్కారు లెక్కలు చెబుతున్నాయన్నారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బీసీల ఆత్మగౌరవానికి, రెడ్ల అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, గ్రాడ్యుయేట్లంతా ఓటు నమోదు చేసుకుని బీసీలకే ఓటేయాలని పిలుపునిచ్చారు. 2028లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు.