బెట్టింగ్ మత్తులో దొంగగా మారిన మేస్త్రీ
శేరిలింగంపల్లి, నవంబర్ 9 (విజయక్రాంతి): కొండాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీకి పాల్పడిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు నాలుగు రోజుల్లోనే అరెస్టు చేశారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు (Online Cricket Betting) బానిసై ఆర్థిక అవసరాల కోసం చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ నెల 2న రాత్రి కొండాపూర్ శిల్పా వ్యాలీలోని సారా ప్రైడ్ అపార్ట్‌మెంట్‌లో సినిమాటోగ్రాఫర్ అనుష్ కుమార్ రెడ్డి నివాసముంటున్న ఫ్లాట్ నంబర్ 502లో ఎవరూ లేని సమయంలో నిందితుడు లిమ్మక అనంత్ కుమార్ (28) చోరీకి పాల్పడ్డాడు. టెర్రస్ నుంచి తాడు సహాయంతో బాల్కనీలోకి ప్రవేశించి స్లైడింగ్ డోర్, అల్మారాను ధ్వంసం చేశాడు. అనంతరం సుమారు 35 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులను (Gold and Silver Jewellery) అపహరించాడు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గచ్చిబౌలి క్రైమ్ టీమ్ ఈ నెల 8న గచ్చిబౌలి ఎక్స్‌రోడ్స్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుంది. దఫా బెట్టింగ్ యాప్ ద్వారా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసైన నిందితుడు డబ్బు అవసరాల కోసం ఈ చోరీకి పాల్పడినట్లు విచారణలో అంగీకరించాడు.
నిందితుడి నుంచి చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు హోండా యాక్టివా స్కూటర్, మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు (Police Recovery). అనంతరం అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
శేరిలింగంపల్లి జోన్ డీసీపీ సీహెచ్. శ్రీనివాస్, అదనపు డీసీపీ ఉడయ్ రెడ్డి, నార్సింగి డివిజన్ ఏసీపీ, గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓ సైదులు పర్యవేక్షణలో గచ్చిబౌలి డీఐ, క్రైమ్ టీమ్, పోలీసు సిబ్బంది సమన్వయంతో కేసును ఛేదించారు.a