పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

18-10-2026 | 05:25am
  1. రంగారెడ్డి జిల్లా జడ్జి కర్ణ కుమార్ 
  2. చేవెళ్లలో ఏజేడీ ఛాంబర్ ప్రారంభం

చేవెళ్ల, అక్టోబరు 17 (విజయక్రాంతి): కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయవాదులు సమన్వయంతో కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా జడ్జి కర్ణ కుమార్(Ranga Reddy District Judge Karna Kumar) సూచించారు. కోర్టుల్లో ప్రశాంత వాతావరణం ఉంటే ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు మరింత అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చేవెళ్ల పట్టణంలోని సివిల్ కోర్టు సమీపంలో బార్ అసోసియేషన్ చొరవ, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ స్పెషల్ జడ్జి (ఏజేడీ) ఛాంబర్ను శనివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగేలా న్యాయవాదులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఛాంబర్ ఏర్పాటుకు బార్ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఛాంబర్కు సంబంధించిన స్థల సమస్యల పరిష్కారంతో పాటు గ్రీన్ ఛానల్ ద్వారా విద్యుత్ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో సుమారు 1.30 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. 

బార్ అసోసియేషన్ సభ్యుల విన్నపం

పెండింగ్లో ఉన్న కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా న్యాయమూర్తికి విన్నవించ దంతోపాటు కోర్టు భవనాల పరిస్థితి దయనీయంగా ఉందని పక్కా భవనం నిర్మించేందుక ఉన్నతాధికారులతో చర్చించిన మాదిరిగా కందవాడ రెవెన్యూ లోని భూమిని ఆర్డర్లోకి తేవాలని కోరారు. మొయినాబాద్ కేసులు రాజేంద్రనగర్ కోర్టులు విచారిస్తున్న సందర్భంలో క్లైంట్స్ కు మూడు బస్సులు ఎక్కి దిగాల్సిన పరిస్థితి ఉండేదని ప్రస్తుతం మొయినాబాద్ కేసులు చేవెళ్ల కోర్ట్ కు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ మాధురి, చంద్రశేఖర్ కార్యదర్శి మల్లేష్తో పాటు సీనియర్ న్యాయవాదులు రాంరెడ్డి, గురువారెడ్డి, రఘునాథ్ రెడ్డి, సురేందర్ గౌడ్, సురేష్, ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్, నారాయణ, సత్యనందం, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు