సమస్యలపై జెన్ ఆల్ఫా గళం

13-11-2026 | 05:05am
  1. సర్కారు బడుల్లో టీచర్ల కొరతతో కుంటుపడుతున్న బోధన  
  2. డిప్యూటేషన్లతో మరింత దిగజారుతున్న పరిస్థితి  
  3. టాయిలెట్లు, తాగునీరు వంటి వసతులూ కరువు    
  4. అధికారులను నేరుగా నిలదీస్తున్న భావితరం
  5. రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న నిరసన జ్వాలలు 

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): సర్కారు బడుల్లో(Government schools)ని సమస్యలపై ఇన్నాళ్లూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి నాయకులు మాత్రమే గళమెత్తేవారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. తమ భవిష్యత్తుకు భరోసా కరవవుతోందని గ్రహిం చిన చిన్నారులే స్వయంగా పోరాట బాట పట్టారు. 2010 తర్వాత జన్మించిన ఈ తరం (జెన్ ఆల్ఫా) పిల్లలు ఎవరి ప్రమేయం లేకుండానే తరగతి గదులను బహిష్కరించి రోడ్డెక్కుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమి, ఉపాధ్యాయుల కొరత విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఇటీవల సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లా బయ్యారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్, కామారెడ్డి జిల్లా బీర్కూర్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్లకార్డులు చేతబూని అధికారులను నిలదీశారు. ఒక చోట సబ్జెక్టు టీచర్ల కొరత, మరో చోట లాంగ్వేజ్ టీచర్ల లేక, ఇంకో చోట ఉన్న ఉపాధ్యాయులను డిప్యూటేషన్లపై ఇతర ప్రాంతాలకు పంపడం విద్యార్థుల ఆగ్రహానికి కారణమవుతోంది. వీటికితోడు కనీస అవసరాలైన మరుగుదొడ్లు, తాగునీరు, ప్రహరీ గోడలు లేకపోవడం, శిథిలావస్థకు చేరిన తరగతి గదులతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్భయంగా ప్రశ్నిస్తున్న విద్యార్థులు

జెన్ ఆల్ఫా తరం తమకు ఏం కావాలో అధికారులు, ఉపాధ్యాయులను నిర్భయం గా ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్ జీ ఉద్యమం తర్వాత జెన్ అల్ఫా ఆందోళనలు ఊపందుకున్నాయి. ప్రధానంగా పాఠశాలల దుస్థితి, లోపాలు, సౌకర్యాలపై ఆందోళనలు జరుగుతున్నాయి. ‘సార్.. మాకు సబ్జెక్టు టీచర్ లేరు, సిలబస్ పూర్తి కాలేదు.. పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయి, మేమేం చదవాలి? పరీక్షలు ఎలా రాయాలి?’ అంటూ బయ్యారం వంటి ప్రాంతా ల్లో పదో తరగతి విద్యార్థులు అధికారులను నేరుగా ప్రశ్నించిన తీరు విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది.

అలాగే సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం జెడ్పీహెచ్‌ఎస్ టెన్త్ క్లాస్ విద్యార్థులు ధర్నాకు దిగారు. టీచర్ల కొరత వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ పదో తరగతిలో 70 మంది విద్యార్థులు ఉండగా గణితం టీచర్ ఒక్కరే ఉన్నారు. మిగతా ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై బదిలీ చేయడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

మహబూబా బాద్ జిల్లా బయ్యారం జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయుల కొరత ఉందని, సిలబస్ పూర్తి కావడం లేదంటూ పదో తరగతి విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో అధికారు లు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడపలో తెలుగు పండిత్ పోస్టు భర్తీ చేయాలని, ఆదిలాబాద్ జిల్లాలో డిప్యూటేషన్‌పై వచ్చిన టీచర్‌ను బదిలీ చేయొద్దని ధర్నా చేశారు.   

పడిపోతున్న విద్యా ప్రమాణాలు

రాష్ర్టంలోని పలు పాఠశాలల్లో ఏకోపాధ్యాయ విధానం, ఒకే గదిలో పలు తరగతు ల నిర్వహణ వంటి సమస్యలు ఇప్పటికే విద్యా ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయి. పైగా, పాఠశాలల విలీనం, కొత్త సంస్కరణల పేరుతో జరుగుతున్న పరిపాలనాపరమైన మార్పుల మధ్య క్షేత్రస్థాయిలో టీచర్ల భర్తీ, మౌలిక వసతుల కల్పనపై జాప్యం జరుగుతుండటం విద్యార్థుల సహనాన్ని పరీక్షిస్తోం ది. గతంలో జంతర్ మంతర్ వేదికగా ‘జెన్ జీ’ యువత సాగించిన ఆందోళనల తరహాలోనే, ఇప్పుడు 15 ఏళ్ల వయసులోపు చిన్నారులు తమ సమస్యలను తామే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు.

నిజానికి ఇలాంటి విద్యార్థి ఉద్యమాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ గత కొంతకాలంగా కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పాఠశాలల దుస్థితి, ఉపాధ్యాయుల కొరత, పరీక్షల నిర్వహణ లోపాలపై విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసన తెలిపిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు అదే తరహా పోరాట స్ఫూర్తి తెలంగాణలో మారుమూల పల్లెలకు సైతం పాకింది. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా తమ హక్కు ల కోసం నిర్భయంగా గళమెత్తడం ప్రభుత్వ యంత్రాంగానికి ఒక పెద్ద సవాల్‌గా మారింది.

మరిన్ని వార్తలు