పుల్లూరుబండపై 24న సామూహిక సత్యనారాయణ వ్రతాలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, తులసి కల్యాణం
సిద్దిపేట రూరల్, నవంబర్ 17 : కార్తీక పౌర్ణమిని(Karthika Purnima) పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా పుల్లూరుబండ శ్రీ నృసింహాచల లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఈ నెల 24న సామూహిక సత్యనారాయణ వ్రతాలు(Satyanarayana Vratas) నిర్వహించనున్నట్లు క్షేత్ర వంశపారంపర్య అర్చకులు తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ ధార్మిక కార్యక్రమంలో భాగంగా శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలతో పాటు తులసి కల్యాణం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కార్తీక మాసంలో భగవంతుని ఆరాధన, దీపారాధన, పూజలు, దైవదర్శనం ఎంతో పుణ్యప్రదమని, ఈ పవిత్ర మాసంలో నిర్వహించే ధార్మిక కార్యక్రమాలు భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని అర్చకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాల కరపత్రాన్ని వంశపారంపర్య అర్చకులు కలకుంట్ల వెంకట నర్సింహాచార్యులు, కృష్ణమాచార్యులు, రంగాచారి, చిలకమర్రి వెంకట రమణాచార్యులు, శేషుకుమార్, హరినాథ్, గౌతమ్ గ్రామ సర్పంచ్ లత వెంకట్, మాజీ సర్పంచులు తిరుపతిరెడ్డి, నరేష్ గౌడ్, దేశిట్టి తిరుపతి, యాదగిరి, కనక మల్లేశం తదితరులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ వ్రతాల్లో పాల్గొనే దంపతులు రూ.301 చెల్లించి రశీదు పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.