నిర్వాసితులను నమ్మించి గొంతు కోసిన కేసీఆర్, హరీశ్‌రావు
* నిర్వాసితుల బాధలతో చెలగాటమాడొద్దు
* ప్రతాప్ రెడ్డి తీరుపై ముంపు ప్రాంతాల కౌన్సిలర్ల ఆగ్రహం
గజ్వేల్, నవంబర్ 17: మల్లన్న సాగర్(Mallanna Sagar) నిర్వాసితులను నమ్మించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు గొంతు కోశారని ముంపు ప్రాంతాల కౌన్సిలర్లు ఉపేందర్ రెడ్డి, గుగ్లోతు రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి, నర్సింహారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం సాయంత్రం గజ్వేల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని చెప్పిన హరీశ్‌రావు చివరకు బాధితులను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను గాలికొదిలి తమ అనుచరులకు దోచిపెట్టారని ఆరోపించారు. బాధితులకు అండగా ఉండాల్సిన బీఆర్ఎస్ నాయకులే ముంపు గ్రామాల ప్రజలను రెచ్చగొడుతూ సమస్యలను మరింత జటిలం చేస్తున్నారని మండిపడ్డారు.
భూసేకరణ, ముంపు గ్రామాల తరలింపు, కేటాయించిన స్థలాలు, ఇళ్లు, మంజూరైన నిధులు, ఇతర ప్యాకేజీల్లో జరిగిన అవకతవకలు ప్రతాప్ రెడ్డికి తెలియవా అని ప్రశ్నించారు. కేసీఆర్, హరీశ్‌రావులకు మద్దతు పలుకుతున్న ప్రతాప్ రెడ్డి సైతం నిర్వాసితులకు జరిగిన అన్యాయం, అవినీతి అక్రమాల్లో భాగస్వామిగా ఉన్నారని ఆరోపించారు. నిర్వాసితుల సమస్యలతో రాజకీయం చేయవద్దని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డిపై తమకు పూర్తి నమ్మకం ఉందని, నిర్వాసితులకు ఇచ్చిన హామీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు సమీర్, పట్టణ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రమోద్, గుంటుకు శ్రీనివాస్, జహంగీర్, షకీల్, కొమ్ము ఉమేష్, హసన్ తదితరులు పాల్గొన్నారు.