కవితను విమర్శించే నైతిక హక్కు ప్రతాప్ రెడ్డికి లేదు

17-11-2026 | 09:08pm
  1. మూడు సార్లు ఓడిపోయి కోట్ల ఆస్తులు ఎలా సంపాదించావు?
  2. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొట్టాల యాదగిరి ముదిరాజ్

గజ్వేల్, నవంబర్ 17: టీఆర్ఎస్ అధినేత్రి కవితను(TRS leader Kavitha) విమర్శించే నైతిక హక్కు వంటేరు ప్రతాప్ రెడ్డికి లేదని ఆ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొట్టాల యాదగిరి ముదిరాజ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం గజ్వేల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్యాకేజీల కోసం పార్టీలు మారే ప్రతాప్ రెడ్డి గత చరిత్ర గజ్వేల్ ప్రజలకు తెలుసన్నారు.

మూడు దశాబ్దాల క్రితం బోరు బండి నడిపించుకున్న వ్యక్తి వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి దివాలా తీయాల్సింది పోయి ప్రతిసారీ కోట్లు కూడబెట్టినట్లు ఆరోపించారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తి గజ్వేల్‌లో పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే సంజీవరావును మత్తులో ముంచి సంతకాలు చేయించుకున్నారని, ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని యాదగిరి ఆరోపించారు. అమాయకుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయడం, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు అక్రమాలను కవిత బయటపెడితే ప్రతాప్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమిటని నిలదీశారు. ప్రతాప్ రెడ్డి ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. మరోసారి కవితపై విమర్శలు చేస్తే సహించేది లేదని, బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఆయన బండారం బయటపెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ ఎడ్ల నర్సింలు, నాయకులు కూరాకుల శ్రీకాంత్, లింగని రాజు, పాషా, లక్ష్మణ్, మిస్బా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు