టెస్ట్ సిరీస్‌కు పంత్ ఫిట్
న్యూజిలాండ్‌కు పయనం
బెంగళూరు, నవంబర్ 12 : న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్ వచ్చింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం పంత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో న్యూజిలాండ్‌కు బయలుదేరారు. ఇరానీ కప్ మ్యాచ్‌ల్లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సమయంలో పంత్‌కు పక్కటెముకల కండరాల గాయం అయింది. దీనివల్ల భారత్-ఏ తరఫున న్యూజిలాండ్-ఏతో జరిగిన మూడు అనధికారిక టెస్టులకు దూరమయ్యాడు.
అప్పటి నుంచీ బీసీసీఐ సీవోఈలో కోలుకుంటున్నాడు. గత రెండు రోజులుగా మ్యాచ్ సిమ్యులేషన్ పరీక్షలలో విజయవంతంగా పాస్ కావడంతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సీవోఈ అనుమతినిచ్చింది.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌కు బయలుదేరిన ఫోటోను పంత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. గత వారం పూర్తిగా కోలుకోకపోవడంతో కివీస్ ఏ జట్టుతో చివరి అనధికారిక టెస్ట్ కూడా పంత్ ఆడలేదు. కాగా పంత్ రాకతో తుది జట్టు ఎంపికలో కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్‌కు కొత్త తలనొప్పి మొదలైంది. వికెట్ కీపింగ్ పంత్, జురెల్‌లో ఒకరికే చోటు దక్కనుంది.