గరిడేపల్లిలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ
గరిడేపల్లి, నవంబర్ 15 (విజయక్రాంతి): గరిడేపల్లి మండల కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈనెల 18న మహాపడి పూజ, పంచామృతాభిషేక మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కమిటీ సభ్యులు, గురుస్వాముల పర్యవేక్షణలో భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ ఉత్సవాలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు తరలిరానున్నారు. వేడుకల్లో భాగంగా ఉదయం 5 గంటలకు గణపతి హోమం, 7 గంటలకు విఘ్నేశ్వర పూజ, సుదర్శన హోమం, 8 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు.
ఉదయం 10 గంటలకు భజనలు, గ్రామ సంకీర్తనతో పాటు స్వామివారి ఊరేగింపు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక పూజలు, నైవేద్య సమర్పణ అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు అత్యంత భక్తిశ్రద్ధలతో మహాపడి పూజ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.