ఒంటి గంటకే ఇంటికి!

18-11-2026 | 05:10am
  1. పగటి పూటే పని ముగించి వెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు?
  2. తదుపరి కార్యాలయాలు తాళాలతో దర్శనాలు!
  3. ప్రజలకు అందని పంచాయతీ సేవలు.. పనుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
  4. యాప్లలో హాజరు.. క్షేత్రస్థాయిలో మాత్రం ఉండరు
  5. చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారంటూ గ్రామస్తుల ఆరోపణలు
  6. కార్యదర్శుల పనివేళలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏదంటూ ప్రశ్నలు

మోతె, నవంబర్17: గ్రామీణ ప్రజలకు(Rural people) నిత్యం అందుబాటులో ఉండాల్సిన గ్రామపంచాయతీ కార్యాలయాలు(Gram Panchayat Offices) మధ్యాహ్నం ఒంటి గంటకే మూతపడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని పలు గ్రామపంచాయతీ  కార్యాలయాలకు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తాళాలు వేసి కనిపిస్తున్నాయని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. కార్యదర్శులు(Secretaries) ముందుగానే వెళ్లిపోవడంతో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలకు నిరాశే ఎదురవుతోందనీ పలువురు స్థానికులు చెబుతున్నారు.

పనుల కోసం ప్రజల ప్రదక్షిణలు:

జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు(Birth and death certificates), ఇంటి నిర్మాణ అనుమతులు(Building construction permits), ఇతర దరఖాస్తుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలు కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నచిన్న పనుల కోసం సైతం పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. కార్యదర్శులు గ్రామాలకు చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారే తప్ప ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తున్నారు.

యాప్లలో హాజరు..క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం: 

ప్రభుత్వ యాప్లలో ఫొటోలు తీసి హాజరు నమోదు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, చెత్త సేకరణ వంటి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఏదీ.?

పంచాయతీ కార్యాలయాలు నిర్ణీత పనివేళల్లో పనిచేస్తున్నాయా లేదా అనేది ఎంపీఓ, ఎంపిడిఓ , ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే మండలంలో ఈ పర్యవేక్షణ సక్రమంగా లేకనే పంచాయతీ కార్యదర్శులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఉదయం పూట హాజరు వేయాలి కాబట్టి సమయానికి వచ్చి మధ్యాహ్నానికి కార్యదర్శులు ఇంటి దారి పడుతున్నారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు  కార్యదర్శుల హాజరు, విధుల నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి ప్రజలకు నాణ్యమైన సేవల్యందెలా చూడాలని పలువురు కోరుతున్నారు.

సమయపాలన పాటించని కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలి                                                                                         

సమయపాలన పాటించకుండా విధులకు గైర్హాజరవుతున్న పంచాయతీ కార్యదర్శులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి గ్రామపంచాయతీ కార్యాలయాలు నిర్ణీత పనివేళలో తప్పనిసరిగా తెరిచి ఉండేలా ఉన్నత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలి ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాల మంజూరులో అసలు సమస్యలు లేకుండా చూడాలి

మట్టిపల్లి సైదులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, 

మోతె మండలం.. 

నా దృష్టికి రాలేదు

కార్యదర్శులు తొందరగా వెళ్తున్నారన్న విషయం నాదృష్టికి రాలేదు. అధికారికంగా ఎంపీఓ ద్వారా నా వద్దకు వస్తే సిఎల్ వేయడం లేదా శాలరీ కట్ చేయడం వంటి చర్యలు తీసుకుంటా.

సందీప్ కుమార్, ఎంపిడిఓ, మోతె 

మరిన్ని వార్తలు