ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి అందరి సహకారం అవసరం
మున్సిపల్ అఖిలపక్ష సమావేశంలో పలు నిర్ణయాలు..
నేరేడుచర్ల, నవంబర్17 (విజయక్రాంతి): నేరేడుచర్ల(Nereducherla) పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, ఎస్ఐ సీహెచ్. గోపాల్ రెడ్డి, తహశీల్దార్ సురిగి సైదులు, హైవే ఏఈ తదితరులు హాజరై ప్రధాన రహదారులు, కూడళ్లు, మార్కెట్ ప్రాంతాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారులపై పార్కింగ్ క్రమబద్ధీకరణ, రహదారులపై ఆక్రమణల తొలగింపు, పాదచారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించారు.ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ట్రాఫిక్ నియంత్రణ కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు నిబంధనలు పాటించి సహకరించాలని సమావేశంలో కోరారు.