సొంత కారు.. అద్దె కారు బిల్లులు!

09-11-2026 | 04:07pm

ఆలేరు నీటిపారుదల శాఖ డీఈఈకి నెలకు రూ.33 వేల భత్యమా?

అద్దె కారు, ప్రయాణ ఖర్చుల పేరుతో ప్రభుత్వ ఖజానాకు గండి? ఇంటి అద్దె భత్యంపైనా ఆరోపణలు

గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన దయ్యాల సంపత్.. విచారణకు డిమాండ్

ఆలేరు,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగి సొంత కారును అధికారిక విధులకు వినియోగిస్తూ.. అద్దె కారు, ప్రయాణ ఖర్చుల పేరుతో ప్రతినెలా రూ.33 వేల వరకు ప్రభుత్వ నిధులు పొందుతున్నారనే ఆరోపణలు ఆలేరులో కలకలం రేపుతున్నాయి. ఆలేరు నీటిపారుదల శాఖ(Aleru Irrigation Department)లో విధులు నిర్వహిస్తున్న డీఈఈ శ్రీనివాసరెడ్డి(DEE Srinivas Reddy)పై పట్టణానికి చెందిన దయ్యాల సంపత్ సోమవారం సంచలన ఆరోపణలు చేస్తూ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.

ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. డీఈఈ శ్రీనివాసరెడ్డి అధికారిక అవసరాల కోసం సొంత కారును వినియోగిస్తున్నప్పటికీ, అద్దె కారు, ప్రయాణ ఖర్చుల పేరుతో ప్రతినెలా రూ.33 వేల వరకు ప్రభుత్వ నిధులు పొందుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదే కాకుండా ఇంటి అద్దె భత్యం (House Rent Allowance) కూడా ప్రభుత్వ ఖజానా నుంచి పొందుతున్నారని ఆరోపించారు. సొంత కారు వినియోగం ఒకవైపు.. అద్దె కారు పేరుతో ప్రభుత్వ భత్యాలు మరోవైపు.. ఇంటి అద్దె భత్యం ఇంకోవైపు.. ఇలా ఒకే అధికారికి పలు రకాల భత్యాలు ఎలా చెల్లిస్తున్నారంటూ ఫిర్యాదుదారుడు ప్రశ్నించారు.

ప్రజాధనాన్ని ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా భత్యాలు పొందితే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లదా? అని సంపత్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై గతంలోనూ పలుమార్లు ప్రశ్నించినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని ఆయన పేర్కొన్నారు.

రూ.33 వేల భత్యానికి లెక్కలేవి?

సొంత వాహనం వినియోగిస్తున్నారా? అద్దె కారు సేవలు తీసుకుంటున్నారా? అద్దె కారు బిల్లులు ఎవరి పేరుతో సమర్పిస్తున్నారు? ప్రయాణ ఖర్చుల చెల్లింపులకు అనుమతులు ఉన్నాయా? ఇంటి అద్దె భత్యం పొందేందుకు అర్హతలు ఏమిటి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదుదారుడు కోరారు.

ప్రభుత్వ నిధుల చెల్లింపులకు సంబంధించిన బిల్లులు, రికార్డులు, అనుమతులను పరిశీలించి వాస్తవాలను బయటపెట్టాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొంత కారు ఉన్నా అద్దె కారు భత్యమా? నెలకు రూ.33 వేల చెల్లింపుల వెనుక అసలు కథేంటి? అధికారుల విచారణలో నిజాలు బయటపడతాయా? అన్నది ఇప్పుడు ఆలేరులో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు