వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం..
క్షేత్రపాలకుడికి ఆకు పూజ... నిత్య రాబడి 25,91,313/-
యాదగిరిగుట్ట, నవంబర్ 17 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy) వారి ఆలయంలో నిత్య కళ్యాణమును పండితులు వైభవంగా నిర్వహించారు. మంగళవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో గల ఆంజనేయ స్వామికి అర్చక బృందం వారు మన్య సూక్త పారాయణముతో అభిషేకం నిర్వహించారు.
సింధూరంతో అలంకరించిన స్వామివారికి వివిధ రకాల సుగంధం వెదజల్లే ద్రవ్యాల పూలమాలలతో అలంకరించి నాగవల్లి దలార్చన నిర్వహించారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులు పాల్గొన్నారు. 207 మంది సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతము పూజల అనంతరం కొండపైన స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. స్వామివారి నిత్య రాబడి 25,91,313/- వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.