విద్య, ఆరోగ్యం, సమానత్వం – ప్రతి చిన్నారి హక్కు
ములకలపల్లి,నవంబర్ 14,(విజయక్రాంతి): బాలల దినోత్సవాన్ని(Children's Day) పురస్కరించుకుని రాచన్నగూడెం యూపీఎస్ పాఠశాల(Rachannagudem UPS School) వద్ద బాలల గ్రామసభను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarvepalli Radhakrishnan) చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ మడకం విజయ మాట్లాడుతూ నవభారత నిర్మాణంలో గ్రామ స్వరాజ్య సాధనలో పిల్లల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు.
మహాత్మా గాంధీ(Mahatma Gandhi) కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే గ్రామ నిర్ణయాధికార ప్రక్రియలో సమాజంలోని అన్ని వర్గాలతో పాటు పిల్లల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.చిన్నారులకు బాల్యం నుంచే ప్రజాస్వామ్య విలువలు,హక్కులు,సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడానికి బాలల గ్రామసభ ఒక అద్భుతమైన వేదిక అని తెలిపారు.
గ్రామంలోని విద్యార్థులకు విద్యావకాశాలు, ఆటస్థలాలు, రక్షిత తాగునీరు, అంగన్వాడీ కేంద్రాల పనితీరు, బాలల రక్షణ, బాల్యవివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు పిల్లల అభిప్రాయాలను సేకరించడం ఎంతో ముఖ్యమని అన్నారు.ప్రతి గ్రామసభలో పిల్లలు పాల్గొనడం వల్ల వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందడంతో పాటు, గ్రామంలోని సమస్యలు నేరుగా అధికారుల దృష్టికి వస్తాయని వివరించారు. రాబోయే గ్రామసభల్లో పిల్లలు చురుగ్గా పాల్గొనేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు చొరవ తీసుకుని వారిని ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బిట్టా వెంకటేశ్వర్లు, అంగనవాడీ టీచర్లు అరుణ,తిరుపతమ్మ, కరుణ కుమారి,రాములమ్మ,వరలక్ష్మి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.