పాలిటెక్నిక్‌లపై ప్రభుత్వం వెనక్కి

14-11-2026 | 08:24pm

హైదరాబాద్: తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థులు(Polytechnic Students), అధ్యాపకులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి (SHAKTI) శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలన్న గత నిర్ణయాన్ని సవరించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో 97(GO 97)కు మార్పులు చేస్తూ జీవో 157ను విడుదల చేసింది. తాజా ఉత్తర్వులతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు(Government Polytechnic Colleges) ఉన్నత విద్యాశాఖ పరిధిలోనే కొనసాగనున్నాయి.

విద్యార్థుల ఆందోళనలతో మారిన నిర్ణయం

గతంలో ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (Young India Skills University) వ్యవస్థలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై విద్యార్థులు, అధ్యాపకుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డిప్లొమా విద్య భవిష్యత్తు, ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు, ఉద్యోగుల సర్వీసు నిబంధనలపై ఆందోళనలు మొదలయ్యాయి.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు నిరసనలు చేపట్టారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కె. కేశవరావు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యార్థులు, అధ్యాపక సంఘాలతో చర్చించిన కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

ఐటీఐలు, ఏటీసీలు మాత్రం శక్తి పరిధిలోనే!

కొత్త ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు(Polytechnic Colleges), యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉన్నత విద్యాశాఖ పరిపాలనా పరిధిలో పనిచేస్తాయి. ఐటీఐలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు మాత్రం శక్తి శాఖ పరిధిలోనే కొనసాగుతాయి. వాటి పాఠ్యప్రణాళికల నియంత్రణ బాధ్యత యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఉంటుంది. అలాగే పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యా ప్రయోజనాలు, సాంకేతిక విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా జీవోతో కొంతకాలంగా కొనసాగుతున్న పాలిటెక్నిక్ వివాదానికి తెరపడినట్లయింది.

మరిన్ని వార్తలు