ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
వెంకటాపూర్, నవంబర్ 14 (విజయక్రాంతి): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని జోహార్ హై స్కూల్ లో (Johar High School)శనివారం విద్యార్థులచే స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకుల పాత్రలు పోషిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. తరగతి గదుల్లో పాఠాలు బోధించడంతో పాటు పాఠశాల పరిపాలనా బాధ్యతలను చేపట్టి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ హామీదా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే స్వయం పరిపాలన దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
కరస్పాండెంట్ గా జాటోత్ సాయి గణపతి రాజ్, ప్రిన్సిపాల్‌గా ఆమెర హామీది, డీఈఓగా వినీష్, ఎంఈఓగా హేమానంద్, పీఈటీగా శ్రేయన్ హర్ష బాధ్యతలు నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పరిపాలనా విధానాలు, ఉపాధ్యాయుల బాధ్యతలు, నాయకత్వ లక్షణాలపై ప్రత్యక్ష అవగాహన కలిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.