అల్లివేరు బస్తాలు పట్టివేత

14-11-2026 | 08:40pm

దుమ్ముగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) దుమ్ముగూడెం మండలం ములకపాడులో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.25 లక్షల విలువైన 200 అల్లివేరుల బస్తాలను అటవీశాఖ అధికారులు(Forest officials) శనివారం స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోని రెండు పట్టర్ గదులపై అధికారులు దాడులు నిర్వహించి వీటిని సీజ్ చేశారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

ఈ సరుకును అక్రమంగా రవాణా చేసేందుకు నిల్వ చేసినట్లు అనుమానిస్తున్నారు. స్థానికంగా కొంతమంది వ్యక్తులు అటవీ ఉత్పత్తులను అక్రమంగా సేకరించి, అధిక ధరలకు విక్రయించేందుకు యత్నించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దాడిలో పాల్గొన్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది మొత్తం బస్తాలను తమ ఆధీనంలోకి తీసుకొని దుమ్ముగూడెం రేంజ్ కార్యాలయానికి తరలించారు. అక్రమ రవాణా, నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఇందుకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అటవీ సంపదను అక్రమంగా సేకరించి ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు పేర్కొన్నారు. స్థానికులు కూడా ఇలాంటి అక్రమాలను గుర్తించిన వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని కోరారు. ఈ ఘటనతో దుమ్ముగూడెం పరిసర ప్రాంతాల్లో అక్రమ అటవీ ఉత్పత్తుల రవాణాదారుల్లో కలకలం రేగింది. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న బస్తాలను అధికారులు పూర్తి స్థాయిలో లెక్కిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు