సాటిలేని చదువుల ‘చుక్కా’నీ!
తెలుగు నేల గర్వించదగ్గ విద్యావేత్తల్లో చుక్కా రామయ్య(Chukka Ramaiah)గారిది ప్రత్యేక స్థానం. ఉపాధ్యాయుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా ఉద్యమంగా విస్తరించింది. ఐఐటీ ప్రవేశ పరీక్షలకు పేద, మధ్యతరగతి విద్యార్థులను సన్నద్ధం చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన ‘ఐఐటీ రామయ్య’గా ప్రసి ద్ధి చెందారు. అయితే ఆయన వ్యక్తిత్వాన్ని కేవలం ఐఐటీ శిక్షణకే పరిమితం చేయలేం.
విద్యావ్యవస్థను లోతుగా అధ్యయనం చేసి న పరిశీలకుడిగా, సమాజంలోని అసమానతలను ప్రశ్నించిన సామాజిక తత్వవే త్తగా, సామాజిక దురలవాట్లపై పోరాటం చేసిన యోధుడిగా, తన అనుభవాలను అక్షరబద్ధం చేసిన రచయితగా, విద్యా సమస్యలపై సరైన వేదికలపై గళమెత్తిన శాసనమండలి సభ్యుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ ఏడాది నవంబరు 20న 101వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి రచనలపై మరోసారి మాట్లాడుకోవడం అవసరం.
చుక్కా రామయ్య రచించిన గ్రంథాల్లో ‘చిన్న పాఠం’, ‘మొదటి పాఠం’, ‘దేశదేశాల్లో విద్య’, ‘బడిపంతుళ్లకు రాజకీయా లా?’, ‘చదువుల తోవ’, ‘చిట్టి చేతులు’, ‘దర్యాప్తు’, ‘ఈ మట్టి రుణం తీర్చుకుంటా’, ‘నడక’, ‘జ్ఞాన లోగిళ్లు’, ‘ఇంటి భాష’, ‘మరో పాఠం’, ‘మన చదువులు’, ‘లెక్కలతో నా ప్రయోగాలు’, ‘ప్రాథమికం’, ‘ప్ర పంచీకరణ విద్య’, ‘రామయ్య జ్ఞాపకాలు’, ‘సంక్షేమ విద్య’, ‘సంవాదం’, ‘తరగతి’ తదితర రచనలు ఉన్నాయి. వీటిలో కొన్ని వ్యాస సంపుటాలు. మరికొన్ని విద్యారంగంలోని నిర్దిష్ట సమస్యలను విశ్లేషించే గ్రంథాలు. వీటిలో ఒక గ్రంథాన్ని పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించడం విశేషం.
2007లో వెలువడిన ‘తరగతి’ అనే విద్యావ్యాసాల సంకలనం, ఇతర గ్రంథా లు ఆయన విద్యా సంబంధిత ఆలోచనలకు అద్దం పడతాయి. ‘తరగతి’ గ్రంథం లో 38 వ్యాసాలు ఉన్నాయి. ‘గురువుకు నిత్య వైభవం’, ‘ఉపాధ్యాయుడు అనధికార శాసనకర్త’, ‘సంస్కరణలంటే దుబా యింపులా’, ‘ఐ.ఐ.టి.ల లక్ష్యమేమిటి?’, ‘బాసరలోనే ఐఐటీ ఎందుకంటే?’ వంటి శీర్షికలే ఆయన ఆలోచనల పరిధిని, ప్రశ్నించే తత్వాన్ని తెలియజేస్తాయి. ‘సంస్కరణలంటే దుబాయింపులా’ అనే వ్యాసం సంస్కరణలు అవసరమైనవే. సంస్కరణలు లేకుండా పురోగతి లేదు అనే వాక్యం తో ప్రారంభమవుతుంది.
ఈ వాక్యం ఆయన ఆలోచనా విధానానికి ప్రతీక. హేతుబద్ధమైన సంస్కరణలను ఆయన వ్యతిరేకించరు. ఇదే వ్యాసంలో ఆయన సంస్కరణల పేరుతో జరిగే మార్పులను గుడ్డిగా అనుసరించకూడదనే భావనను కూడా వ్యక్తం చేస్తారు. ఇది ఆయన విమర్శనాత్మక దృక్పథానికి మంచి ఉదాహ రణ. సంస్కరణల పేరుతో జరిగే మార్పు లు సమాజ అవసరాలకు, దేశ స్వాభిమానానికి, ప్రజల ప్రయోజనాలకు అనుగు ణంగా ఉండాలన్నది ఆయన అభిప్రాయం. మార్పును ఆహ్వానిస్తూనే దాని ప్రయోజనాన్ని ప్రశ్నించడం ఆయన విమర్శనాత్మక దృష్టికి నిదర్శనం.
విద్యలో సమానత్వం
‘ఐఐటీల లక్ష్యమేమిటి?’ అనే వ్యాసంలో ఉన్నత విద్య విస్తరణను ఆయన విశ్లేషించిన తీరు గమనించదగినది. ఉన్నత విద్య గత 50 సంవత్సరాలలో విస్తరించిన మాట వాస్తవమే అని అంగీకరిస్తూనే, ఆ విస్తరణలోని అసమానతలను పరిశీలిస్తారు. విద్యావకాశాల విస్తరణకు, సామా జిక న్యాయానికి మధ్య ఉండాల్సిన సం బంధాన్ని ఈ వ్యాసం చర్చిస్తుంది. విద్యాసంస్థల సంఖ్య పెరగడం మాత్రమే విద్యా భివృద్ధికి కొలమానం కాదని, విద్య అందరికీ అందుబాటులోకి రావాలని రామయ్య భావన. విద్యలో అవకాశాల సమానత్వం, సామాజిక న్యాయం, నాణ్యత పరస్పర సంబంధం కలిగిన అంశాలని ఆయన రచనలు గుర్తుచేస్తాయి.
‘బాసరలోనే ఐఐటీ ఎందుకంటే?’ వం టి శీర్షికల ద్వారా విద్యాసంస్థల స్థానం, వాటి అవసరం, ప్రాంతీయ సమతుల్యత వంటి అంశాలను రామయ్య చర్చకు తీసుకొచ్చారు. ఒక ప్రశ్నను పాఠకుడి ముం దుంచి, దాని వెనుక ఉన్న విధానపరమైన లోపాలను విశ్లేషించడం ఆయన ప్రత్యేకత.
మాతృభాషపై మమకారం
రామయ్య రచనల్లో మాతృభాషలో విద్యాబోధనకు సంబంధించిన ఆలోచనలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఉర్దూ మీడి యంలో విద్యాభ్యాసం చేసిన ఆయనకు మాతృభాషలోనే విద్య అందించడంలోని ఆవశ్యకత బాగా తెలుసు. ‘ఇంటి భాష’ అనే గ్రంథ శీర్షికే ఆయన భాషా దృక్పథాన్ని సూచిస్తుంది.
పిల్లవాడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మొదట మాతృభాష ద్వారానే అర్థం చేసుకుంటాడు. అలాంటి భాషను విద్యకు దూరం చేయడం వల్ల విద్యార్థి సహజమైన ఆలోచనా ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని ఆయన భావన. ఆంగ్ల భాష అవసరాన్ని ఆయన తిరస్కరించరు. అయితే ఆంగ్లం నేర్చుకోవడం కోసం మాతృభాషను నిర్లక్ష్యం చేయడాన్ని ప్రశ్నిస్తారు. భాష కేవలం భావప్రకటన సాధ నం మాత్రమే కాదని, ఒక సమాజ సం స్కృతి, ఆలోచనా సంపద, అస్తిత్వానికి ప్రతీక అని ఆయన నిశ్చితాభిప్రాయం. ఇదే విషయాన్ని ఆయన రచనలు నిరూపిస్తాయి.
ప్రశ్నించడమే ప్రధాన ఆయుధం
రామయ్య రచనల్లో కనిపించే విశిష్టత ఆయన ప్రశ్నించే పద్ధతి. పాఠకుడికి ఉపన్యాసం ఇవ్వకుండా, వరుస ప్రశ్నలతో ఆలోచింపజేస్తారు. ‘ఆంగ్లం ఒక్కటే ఆదుకుంటుందా?’, ‘ప్రభుత్వ విద్యకు ప్రాణం పోయడం ఎలా?’, ‘బాసరలోనే ఐఐటీ ఎందుకంటే?’ వంటి ప్రశ్నాత్మక శీర్షికలే ఇందుకు ఉదాహరణలు. ప్రశ్నలోనే సమస్యను పరిచయం చేసి, దాని వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలను చుక్కా రామయ్య విశ్లేషిస్తారు. రామయ్య భాష పాండిత్య ప్రదర్శనకు పరిమితమైనది కాదు. పాఠకుడితో ముఖాముఖి సం భాషిస్తున్నట్లుగా ఉంటుంది.
సాధారణంగా మాట్లాడుకునే భాషలోనే గంభీరమైన విద్యా విషయాలను వివరిస్తారు. అవసరమైన చోట నేరుగా విమర్శిస్తారు. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను, ప్రైవేటు విద్యాసంస్థల వ్యాపార ధోరణులను, విద్యావ్య వస్థలోని అసమానతలను నిర్మొహమాటంగా ఎత్తిచూపుతారు. అదే సమయంలో వ్యంగ్యం, నర్మగర్భమైన వ్యాఖ్యలు, సందర్భోచితమైన ఉదాహరణలతో తన అభి ప్రాయాన్ని బలంగా వ్యక్తం చేస్తారు. తెలుగు భాషలోని సహజమైన పలుకుబడి రామయ్య రచనలకు ఆలంబన. జాతీయాలు, నానుడుల ధోరణిలోని ప్రయోగాలు, సామాన్య జీవితంలోని అనుభవాలు ఆయన వాదనకు సహజత్వాన్ని కల్పిస్తాయి.
అయితే ఆయన ప్రధాన బలం అలంకారాల వినియోగం కంటే ఆలోచనల్లోని స్పష్టత, విశ్లేషణలోని పదును, విమర్శలోని నిజాయితీ. చుక్కా రామయ్య రచనలు ఒక సమస్యను ప్రస్తావించి వదిలివేయవు. దాని మూలాలను అన్వేషి స్తాయి. పరిష్కార మార్గాలను సూచిస్తాయి. మంచి ఉపాధ్యాయుడు పాఠ్యపుస్త కంలోని పాఠాన్ని మాత్రమే బోధించేవాడు కాదని, విద్యార్థి జీవితానికి దిశాని ర్దేశం చేసేవాడని ఆయన భావన. ఉపాధ్యాయుడి వ్యక్తిత్వం, నిబద్ధత, నిరంతర అధ్యయనం విద్యార్థుల ఎదుగుదలకు ఎంత అవసరమో ఆయన వివరిస్తారు.
అక్షరాల ఉద్యమం
చుక్కా రామయ్య రచనలు ఒక కాలానికి చెందిన విద్యా సమస్యల వ్యాఖ్యానాలు మాత్రమే కావు. అవి విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఆలోచనా సం పద. ఐఐటీ రామయ్యగా వేలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసిన ఆయన తన రచనల ద్వారా ఉపాధ్యాయులను, విద్యావేత్తలను, పాలకులను, సమా జాన్ని కూడా ప్రశ్నించారు.
ఒకవైపు తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తును నిర్మిస్తూ, మరోవైపు అక్షరాల ద్వారా విద్యావ్యవస్థ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ప్రయత్నించిన అరుదైన వ్యక్తి చుక్కా రామయ్య. ఆయన జీవితం ఒక పాఠం. ఆయన అనుభవాలు ఒక పాఠ్యగ్రంథం. ఆయన రచనలు విద్యారంగానికి నిరంతర దిక్సూచులు. నూటొక్క జన్మదినాన్ని ఈ నవంబరు 20వ తేదీన జరుపు కుంటున్న వేలాది విద్యార్థుల దిక్సూచి చుక్కా రామయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆశించిన విధంగా సమానత్వంతో కూడిన, మాతృభాషకు గౌరవమిచ్చే, నాణ్యమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఆవిర్భవించాలని విద్యాభిమానుల ఆకాంక్ష.
సెల్: 9441046839
డా రాయారావు సూర్యప్రకాశ్